దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక భేటీ ఆసక్తిని రేపుతోంది. ఒక కాంగ్రెస్ ఎంపీతో..ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. భార్య హత్య కేసు వివాదాన్ని ఎదుర్కొంటున్న శశిథరూర్ తో భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సమావేశం కావడం ఇప్పుడు కొత్త విశ్లేషణలకు కారణం అవుతోంది. ఢిల్లీలోని శశిథరూర్ ఇంటికి వెళ్లాడు వరుణ్ గాంధీ. కొన్ని నిమిషాల పాటు వీరి సమావేశం జరిగినట్టు సమాచారం. మరి అసలే శశిథరూర్ ఇంటి చుట్టూ ఇప్పుడు పోలీసులు తిరుగుతున్నారు. ఆయన భార్య సునందా పుష్కర్ ది ఆత్మహత్య కాదు.. హత్యేనని తేల్చిన ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారం గురించి విచారణ జరుపుతున్నారు. ఆమెను ఎవరు హత్య చేయించి ఉంటారు? ఆమె ఎందుకు హత్య చేయబడి ఉంటుంది? అనే అంశాల గురించి ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. ఈ విషయాన్ని తేల్చడానికి పోలీసులు శశిపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆయనను ఢిల్లీ పోలీసులు ఒక సారి ప్రశ్నించారు. మరోసారి కూడా వారు శశిని ప్రశ్నించే అవకాశాలున్నాయని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీ, అందునా కాంగ్రెస్ కు శత్రువు అయిన భారతీయ జనతా పార్టీ ఎంపీ వెళ్లి శశితో సమావేశం కావడం అంటే.. ఇది ఒక రకంగా సంచలనమే! ఈ సమావేశం గురించి ఒక్కోరు ఒక్కో భాష్యం చెబుతున్నారు. ఇది వారి వ్యక్తిగత సమావేశం అయ్యి ఉండవచ్చిన కొంతమందిఅంటుంటే.. మరికొందరేమో.. శశికి బీజేపీ ఏమైనా అభయం ఇవ్వడానికే వరుణ్ ను ఆయన ఇంటికి పంపిందా?! అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ అసలు కథ ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: