స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ వైఫల్యం చెందడాన్ని సిఎం చంద్రశేఖర్‌రావు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య నిర్వహిస్తున్న ఈ శాఖను అయన నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు సిఎం కార్యాలయ విశ్వనీయ వర్గాల సమాచారం. వైద్య ఆరోగ్యశాఖను ఎవరికి అప్పగించాలనే అంశంపై ముఖ్యమంత్రి పార్టీలో తనకు సన్నిహితులైన వారితో గురువారం చర్చించినట్టు ఈ వర్గాల సమాచారం. ఉప ముఖ్యమంత్రి రాజయ్య నుంచి వైద్యశాఖను తొలగించడానికి సంకేతంగానే మంత్రికి సన్నిహితుడైన ఆరోగ్యశాఖ డైరెక్టర్ సాంబశివరావుపై గురువారం వేటు పడిందని అధికారవర్గాల సమాచారం. ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న సాంబశివరావును తొలగించి ఈ బాధ్యతలను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌కు అప్పగిస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య నుంచి వైద్యశాఖను తొలగించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ఈ అంశాన్ని గవర్నర్‌తో బుధవారం భేటీ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించినట్టు అధికార వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఎవరికి అప్పగించాలనే అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజయ్యకు ఏ శాఖను అప్పగించాలనే దానిపై ఒక నిర్ణయానికి రాకపోవడం వల్లనే జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజులలో ఉప ముఖ్యమంత్రి శాఖ మారే అవకాశం ఉన్నట్టు ఈ వర్గాలు పక్కా సమాచారంగా చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే రాజయ్య నుంచి ఈ శాఖను తప్పించబోతున్నారని బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ, అందుకు ఇతర కారణాలు ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. ‘కరప్షన్ ఫ్రీ’ స్టేట్‌గా ప్రధాన మంత్రి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వానికి కితాబు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల స్వయంగా చెప్పారు. అయితే వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగు చూడటం ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది. వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు అందించినట్టు ఈ వర్గాల సమాచారం. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహణకు ఎంపిక చేసిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు రాగానే వాటిని రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రికంటే ముందుగానే రాజయ్య బహిరంగ ప్రకటన చేయడం, లంచం తీసుకుంటే తనకు ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి వరంగల్‌లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే వంద, రెండు వందలు లంచం పుచ్చుకుంటే పెద్ద తప్పేమి కాదని ఉప ముఖ్యమంత్రి పత్రికాముఖంగా ప్రకటన చేయడం ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించడంతో పాటు స్వైన్ ఫ్లూ పట్ల నిర్లక్ష్యానికి తోడు అయినట్టు ఈ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: