రాష్ట్ర విభజన పుణ్యమా అని ఇప్పుడు దేవుళ్లు కూడా విడిపోయారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భాగమైన భద్రాచలం రామాలయం ఇప్పుడు తెలంగాణ సొంతమైంది. పోలవరం ముంపు ప్రాంతం కోసం భద్రాచలం మండలం మొత్తాన్ని ఏపీలో కలిపేసినా.. ఒక్క భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణకే ఉంచేశారు. నిజాం కాలం నుంచి భద్రాచలం ఆలయ నిర్వహణ అంతా తెలంగాణపాలకులే చూస్తున్నారన్న కారణంతోనో.. ఎలాగూ మిగిలిన గ్రామాలు కలిపేస్తున్నాం కదా.. ఆలయమైనా తెలంగాణకిద్దామన్న కారణంతోనే.. మొత్తానికి భద్రాచల రామయ్య తెలంగాణవాడయ్యాడు.  స్పర్ధయా వర్దతే విద్యా.. అన్నారు. ఇదే సూత్రం ఇప్పుడు దేవుళ్లకూ, గుళ్లకూ వర్తిస్తుందనుకుంటా. తెలంగాణ భద్రాద్రి రాముడికి పోటీగా మన ఆంధ్రారామున్ని అభివృద్ధి చేసుకుందామంటున్నారు కొందరు నాయకులు.. కడప జిల్లాలో పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయాన్ని భద్రాచలానికి దీటుగా అభివృద్ది చేయాలని కడప జిల్లా నాయకులు కోరుతున్నారు. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై నినదిస్తున్నారు. గురువారం కడప ప్రెస్ క్లబ్బులో వీరు సమావేశమై.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.  ఒంటిమిట్ట రామాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు కడప జిల్లా నేతలు. 14వ శతాబ్దంలోనే ఈ రామాలయాన్ని నిర్మించారట. నాలుగు రాజవంశాలు వారు ఒంటిమిట్ట రామాలయాన్ని వైభవోపేతంగా నిర్వహించారట. అప్పట్లో.. కాశీ రామేశ్వరం యాత్ర చేసే వారికి ఒంటిమిట్ట ఒక మజీలీ కేంద్రంగా భాసిల్లేదట. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఒంటిమిట్టి ఆలయానికి వస్తుంటారు. అందుకే.. ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్ట ఆలయాన్ని భద్రాచలానికి పోటీగా నిర్వహించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: