అటు నారా లోకేష్ బాబు, ఇటు కల్వకుంట్ల తారక రామారావు.. ఈ ఇరువురూ ఇప్పుడు తమ తండ్రుల ఆధ్వర్యంలో ఉన్న పార్టీలకు అధినేతలకు కాబోతున్నారట. ఈ ఇద్దరూ దాదాపు ఒకేసారి తమ తమ పార్టీల పగ్గాలను స్వీకరించనున్నారని వార్తలు వస్తున్నాయి. తను తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నందు వల్ల పార్టీని తన తనయుడు కేటీఆర్ కు అప్పజెప్పాలని భావిస్తున్నాడట కేసీఆర్. ఇక చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నందు వల్ల టీడీపీ పగ్గాలు అతి త్వరలో లోకేష్ చేతిలోకి రానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పరిణామాలూ చాలా త్వరగా జరగనున్నాయని.. దాదాపు రెండూ ఒకేసారి జరుగుతయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ అటు పార్టీపైన, ప్రభుత్వంపైనా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏకంగా మంత్రులను పిలిపించుకొని సమీక్షలు నిర్వహించేంత వరకూ వెళ్లాడాయన. అధికారికంగా ఏ హోదాలో లేనప్పటికీ లోకేష్ ఈ విధంగా సమీక్షలు నిర్వహించేయడం, ఆయనకు మంత్రులంతా జీ హుజూర్ అనడం విశేషం. ఇక కేటీఆర్ ఇప్పటికే మంత్రి హోదాలో ఉన్నాడు.. గతం నుంచినే పార్టీలోని శ్రేణులతో టచ్ లో ఉన్నాడు. గతంలో కేసీఆర్ ఎంపగా ఉండగా.. అసెంబ్లీలో పార్టీ వాయిస్ ను వినిపించే బాధ్యత కేటీఆర్ తీసుకొన్నాడు. ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆయనకు పార్టీపై మరింత పట్టు పెరిగే ఉంటుంది. మరి స్థూలంగా ఈ ఇద్దరు వారసులూ ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. భారత ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు తిరుగులేదన్న వాస్తవాన్ని చాటుతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: