ప్రజాస్వామ్యంలో ప్రజలదే అధికారం. వారంతా పాలించలేరు కాబట్టి.. తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు పరిపాలిస్తారు. మరి జనంతో నేరుగా ఎన్నికవకపోయినా.. అధికారం చెలాయించే సౌకర్యం ఉందా అంటే.. ఉంది. ప్రతిదానికీ షార్టు కట్ మార్గాలున్నట్టే.. మంత్రిపదవులకూ ఉంది. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి ఎవరినైనా మంత్రిగా ఎన్నుకోవచ్చు. కాకపోతే వారు 6 నెలల్లో చట్టసభలకు ఎన్నికవ్వాలి.

మరి ఎన్నికలకు వెళ్తే జనం ఛీకొడితే అప్పుడు పరిస్థితి ఏంటి.. అందుకే ఎమ్మెల్సీ వంటి దొడ్డిదారి అవకాశాలు రాజకీయ నాయకులకు రాజ్యాంగం కల్పించింది. మేథావులు, కళాకారుల కోసం రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు ఇప్పుడు రాజకీయ నాయకులకు రాజమార్గమైపోయింది. అందుకే జనం ఎన్నికల్లో ఎన్నుకోకపోయినా నేరుగా మంత్రిపదవులు అలంకరించవచ్చు. ఆంధ్రా కేబినెట్లో అంతా తానై చక్రం తిప్పుతున్న నారాయణ, తెలంగాణ కేబినెట్లో నాయని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అలాంటివారే.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు స్థానం కల్పించారు. కీలకమైన రహదారులు, భవనాల శాఖ అప్పగించారు. విశేషమేమిటంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.

ప్రజల చేతిలో ఓటమికి గురైనా.. దర్జాగా మంత్రిపదవి అలంకరించారు. ఇప్పుడు లేటెస్టుగా అనూహ్యంగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యేకానీ.. ఎమ్మెల్సీ కానీ కాదు. ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మంత్రిపదవి దక్కడంతో దానికి రాజీనామా తప్పదు. సో..కడియం కు కూడా ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: