ఈనాడు అధిపతి రామోజీరావు.. సొంత పత్రికలో సొంతపేరుతో ఆర్టికల్స్ రాయడం చాలా అరుదు. చారిత్రక సందర్భాల్లోనే ఆయన తన పత్రికలో తన పేరుతో వ్యాసాలు రాస్తుంటారు. అలాంటింది మంగళవారం ఆయన ఈనాడు ఎడిటోరియల్ పేజీలో రాజధాని పేరుపై వ్యాసం రాశారు. ఏపీ రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని రామోజీ తన వ్యాసంలో పేర్కొన్నారు. అమరావతే అని ఎందుకు పెట్టాలి.. దాని వెనకున్న చారిత్రక కారణాలేంటన్న విషయాలను ఆయన కూలంకషంగా చర్చించారు. ఆంధ్రులకు అతి ప్రాచీన రాజధానిగా అమరావతి విలసిల్లిందని.. ఆంధ్రుల ఘనచరిత్రకు అమరావతి సాక్ష్యంగా ఉందని తెలిపారు. క్రీస్తు శకం 5,6 శతాబ్దాల నాటి చరిత్రను ప్రస్తావిస్తూ.. శాతవాహనులు, విష్ణుకుండినులు.. ఆంధ్రను పాలించిన ఈ రెండు రాజవంశాలకు అమరావతితో అవినాభావ సంబంధముందని రామోజీ అభిప్రాయపడ్డారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలోనే అమరావతిలో బుద్దుడు సంచరించాడని.. తొలి కాలచక్రతంత్రాన్ని నిర్వహించాడని తెలిపారు. అమరావతి అంటే మృత్యువులేని ప్రదేశమని.. రాజధానికి అంతకంటే మంచి పేరు దొరకదని ఆయన అభిప్రాయపడ్డారు.  కళల కాణాచిగా అమరావతి ఎలా విలసిల్లింది.. ఆంధ్రుల ఖ్యాతిని జగ్విదితం ఎలా చేసిందో రామోజీ తన వ్యాసంలో సోదాహరణంగా వివరించారు. రామోజీ వ్యాసం చదివిన తర్వాత రాజధానికి అంతకంటే మంచిపేరు దొరకదేమో అని పాఠకులు ఫీలవడం ఖాయం. ఐతే.. టీడీపీ సర్కారు.. ఎన్టీఆర్ పేరుల కలసి వచ్చేలా రాజధాని పేరు పెట్టాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నగర్, తారక రామనగర్ వంటి పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి చంద్రబాబు ఎన్టీఆర్ పేరు వైపు మొగ్గుతారా.. లేక.. రామోజీ సూచన పాటిస్తారా.. వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: