తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రాజయ్యకు అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దళిత వర్గానికి చెందిన రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీసింది. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 7 నెలల్లోనే ఓ మంత్రిని బర్తరఫ్ చేయడం ఈ రాజకీయ కలకలానికి కారణమైంది. ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ కేసీఆర్ పలుమార్లు ఎన్నికల సభల్లోనూ, ఇతర వేదికలపైనా హామీ ఇచ్చారు. తీరా తెలంగాణ ఏర్పడిన తర్వాత, అధికారం చేతికందిన తర్వాత.. ఆ హామీని తుంగలో తొక్కి.. తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ వాగ్దాన భంగం తీవ్రత తగ్గించేందుకు దళిత వర్గానికి చెందిన రాజయ్యను ఉపముఖ్యమంత్రిని చేశారు. అందుకు కృతజ్ఞతగా రాజయ్య.. తాను కేసీఆర్ దత్తపుత్రిడినంటూ చెప్పుకునేవారు. పేరుకు ఉపముఖ్యమంత్రిని చేసినా.. కేసీఆర్ ఎన్నడూ రాజయ్యను ఆ స్థాయిలో గౌరవించినట్టు కనిపించదని విశ్లేషకులు చెబుతుంటారు. వరంగల్లో జరిగిన ఓ నిండుసభలో అందరి ముందే రాజయ్య.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా రాజయ్యను పలుమార్లు చులకనగా చూశారు. ఇక మంత్రిపదవి నుంచి రాజయ్యను తొలగించిన తీరు మరీ దుర్మార్గంగా ఉందని విపక్షాలు, విమర్సకులు అభిప్రాయపడుతున్నారు. రాజయ్య అవినీతికి పాల్పడుతున్నారని భావించినా.. కేవలం అధికారంలోకి వచ్చిన 7 నెలలకే పదవి నుంచి తీసేంత అవినీతి రాజయ్య చేశారా..లేక.. రాజయ్యను ముందే టార్గెట్ చేసుకుని.. అవినీతిని సాకుగా చూపారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. తప్పయింది.. ఒక అవకాశం ఇమ్మని రాజయ్య లేఖ రాసినా కేసీఆర్ స్పందించలేదు. ఐతే.. రాజయ్యను పదవి నుంచి తొలగించేందుకు అవినీతే కారణమైతే.. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.. కానీ తొలగించిన విధానం కూడా అవమానించే రీతిలో ఉండటం గమనార్హం. రాజయ్యను కేసీఆర్ పిలిచి.. రాజీనామా చెయ్.. అని చెప్పిఉంటే.. కాదు.. చేయని అని అనేంత ధైర్యం రాజయ్యకు లేదు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి.. నిర్దోషిగా తేలేవరకూ వదవి వదిలేస్తున్నా..అని చెప్పించి.. రాజయ్యతో రాజీనామా చేయించి ఉంటే..గౌరవంగా ఉండేది. ఐతే.. అవినీతిపరుడికి గౌరవం ఏంటని..కేసీఆర్ భావించే పక్షంలో.. రాజయ్యను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి ఉండాల్సింది. రాజయ్య చేసిన అవినీతి రిపోర్డులు బయటపెట్టి ఉండాల్సింది. అవేమీ చేయకుండా.. రాజయ్యను రాజీనామా అడగకుండా.. నియంతృత్వ ధోరణిలో.. బర్తరఫ్ చేయించడం దారుణమని చెప్పకతప్పదు.  రాజయ్య విషయంలో కేసీఆర్ తీరును ఒక్కమాటలో చెప్పాలంటే.. మంద కృష్ణమాదిగ చెప్పినట్టు.. కేసీఆర్ రాజయ్యను రాజకీయంగా హత్య చేశారు. అవినీతిపరుడని ఐఎస్ఐ మార్కు సర్టిఫికెట్ ఇచ్చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతిపరుడిగా ముద్రపడి పదవి నుంచి తప్పుకోవాల్సిరావడం రాజయ్యను తీవ్రంగా బాధించి ఉండవచ్చు. ఆ ఆలోచనలు, ఒత్తిళ్ల కారణంగానే రాజయ్య గుండెనొప్పికి కారణం కావచ్చు. ఏదేమైనా.. ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగానే ఉన్నట్టు రాజయ్య కుమారుడు తెలియజేశారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ఆశిద్దాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: