కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో మిషన్ కాకతీయ. ఒకటి.. ఆనాటి కాకతీయులు తెలంగాణలో ఎన్నో చెరువులు తవ్వించారు. ఇప్పటికీ చాలా చోట్ల తెలంగాణలో ఆ చెరువుల ఆధారంగా వ్యవసాయంసాగుతోంది. అందుకే గ్రామాల్లోని చెరువులను బాగు చేసేందుకు మిషన్ కాకతీయ పేరుతో భారీ కార్యక్రమం చేపడుతోంది. 22వేలకోట్ల రూపాయల నిధులతో 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఈ మిషన్ వల్ల 265 టీఎంసీల నీరు అదనంగా నిల్వ అవుతుందని.. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని చెబుతోంది.  ఇప్పుడీ బృహత్తర పథకంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని తెలంగాణ సర్కారు చెప్పుకుంటోంది. ఈ కార్యక్రమం అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీని కూడా ఆకట్టుకుందట. మిషన్ కాకతీయ అనుభవాలను తమ విద్యార్థులకు పాఠాలుగా చెప్పాలని కోరుతోందట. ఈమేరకు మిచిగాన్ యూనివర్శిటీ.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందట. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి చెందిన ఏడుగురు పరిశోధకుల బృందం మిషన్ కాకతీయ పరిశీలనకు వచ్చిందట. మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ యూనివర్శిటీకి వచ్చి మిషన్ కాకతీయ అనుభవాలపై ఉపన్యాసం ఇవ్వాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ను కోరిందట.  వాస్తవానికి ఈ మిషన్ కాకతీయ.. కార్యక్రమం ఇంకా తెలంగాణలో ఊపందుకోలేదు. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది. కాన్సెప్టు ప్రకారం.. పర్యావణ, ప్రకృతిహితమైన ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం ఆశించిన విధంగా పూర్తయితే.. హరిత తెలంగాణ ఖాయం. కానీ.. ఈ ప్రాజెక్టు.. టీఆర్ఎస్ కార్యకర్తల, నాయకుల జేబులు నింపేందుకే రూపొందించారన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. ఈ మిషన్ కాకతీయ ప్రతిపాదనలు అధికారులు రూపొందిస్తున్నారా.. టీఆర్ఎస్ నాయకులు రూపొందిస్తున్నారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మిషన్ కాకతీయపై అంతర్జాతీయంగా దృష్టి ఉన్నందువల్ల.. మన అవినీతిని చూసి వారు నివ్వెరపోయేలా లేకుండా.. సజావుగా పూర్తి చేస్తే అదే పదివేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: