ప్రభుత్వ నిర్ణయాలలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జోక్యం చేసుకున్నారని చెప్పడానికి కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. యుపిఎ-2 ప్రభుత్వంలో వాతావరణ శాఖమంత్రి జయంతి నటరాజన్‌ ఘాటుగా సోనియాగాంధీకి గత సంవత్సరం నవంబరులో రాసిన లేఖ హిందూ పత్రిక సంపాదించింది. కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమ తులు మంజూరు చేయాలని కోరుతూ, రాహుల్‌గాంధీ 'నిర్దిష్టమైన విజ్ఞప్తులు' చేశారు. అలాగే సహచర మంత్రులు ఒత్తిడిచేసినప్పటికీ భారీ ప్రాజెక్టుల అనుమతులను జయంతి నటరాజన్‌ తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా అంతవరకు పర్యావరణ అనుకూల వైఖరిని కలిగివున్న రాహుల్‌గాంధీ తన వైఖరిని మార్చుకున్నారు.

ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు పార్టీలోని కొంతమంది వ్యక్తులు 'దుర్మార్గమైన, తప్పుడుగా పని గట్టుకు' చేసిన దుష్ప్రచారానికి తాను బలైపోయానని జయంతి నటరాజన్‌ తన లేఖలో పేర్కొన్నారు. నటరాజన్‌ రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే ఆమె రాజీనామా పార్టీ కార్యక్రమాలకోసం కాదని రాహుల్‌గాంధీ కార్యాలయం మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేయించింది. రెండవసారి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం హయాంలో చాలా సూక్ష్మస్థాయి విధాన నిర్ణయాల్లో రాహుల్‌గాంధీ జోక్యం చేసుకున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. రాహుల్‌ జోక్యంపైన కాంగ్రెస్‌ ఎల్లవేళలా తిరస్కరిస్తూనే వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలలో నాకు రాహుల్‌గాంధీ, ఆయన కార్యాలయం నుంచి 'నిర్దిష్టమైన విజ్ఞప్తులు' (అవి మాకు ఆదేశాలు) అం దాయి. ఆ విజ్ఞప్తులను ఆమోదించడంలో నేను జాగ్రత్తగా వ్యవహరించాను' అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

వేదాంత, గిరిజనుల మధ్య : ఒడిషాలోని నియాంగిరి కొండలలో వేదాంత కంపెనీ బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి గాంధీ అభిప్రాయాలు నటరాజన్‌ ఆఫీసుకు తెలియజేశారు. అయితే ఆమె గిరిజనుల ప్రయోజనా లను పరిరక్షిస్తూ వేదాంత కంపెనీకి పర్యావరణ అనుమతులను తిరస్కరించారు. అయినప్పటికీ మంత్రివర్గ సహచరుల నుంచి తీవ్ర ఒత్తిళ్ళు, పరిశ్రమలరంగం నుంచి విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చిందని ఆమె తన లేఖలో తెలిపారు. అద్వానీ గ్రూపు ప్రాజెక్టులకు సంబంధించి చట్టాల ఉల్లంఘటనలపైన ఎన్‌.జి.ఓ.లు, మత్స్యకారులు ఫిర్యాదులు చేశారని, గుజరాత్‌ కాంగ్రెస్‌ నాయకుడు దీపక్‌ బబారియాకు ప్రాజెక్టు విషయంలో సహకరించాలని రాహుల్‌గాంధీ కార్యాలయం తనను కోరినట్టుగా ఆమె తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి మీరు (సోనియాగాంధీ) అనేక కేసులకు సంబంధించి నాకు రాసిన లేఖలలో మీ ఆందోళన వ్యక్తం చేశారు. హిమాచలప్రదేశ్‌లో ధారిదేవి ఆలయంవల్ల నిలిచిపోయిన జీవీకే విద్యుత్తు, మహారాష్ట్రలో లవస ప్రాజెక్టు, గుజరాత్‌లో నిర్మ సిమెంట్‌ ఫ్యాక్టరీ, ఇంకా అనేక ప్రాజెక్టుల విషయంలో మీరు నాకు రాసిన లేఖలలో ఆందోళన వ్యక్తం చేశారు. నా నిర్ణయానికి సంబంధించి పలు నిర్దిష్ట అంశాలు మీకు తెలిపాను' అని ఆలేఖలో రాశారు.

జయంతి నటరాజన్‌ 2013 డిసెంబరులో రాజీనామా చేశారు. అప్పటికి పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా వందరోజులు ఉంది. అప్పుడే పర్యావరణ అనుమతుల విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. పార్టీ కార్యకలాపాలలో పాల్గొనేందుకుగాను జయంతి నటరాజన్‌ రాజీనామా చేశారని కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే తనను 'తప్పించడానికి' అసలు కారణం ఏమిటో ఇప్పటికీ తనకు తెలియదని ఆమె తన లేఖలో రాశారు. 30 ఏళ్ల తన ప్రజాజీవితంలో తను ఎలాంటి తప్పు చేయలేదని, తన పని విధానం, తన కుటుంబానికి గల గొప్ప వారసత్వం అంతా ఈ పరిణామాలవల్ల ధ్వంసమైపోయిందని ఆమె పేర్కొన్నారు. తన అభిప్రాయాలను వెల్లడించడానికై కాంగ్రెస్‌ నాయకత్వంతో కలసి మాట్లాడేందుకు పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, తన లేఖకు సోనియాగాంధీ నుంచి ఇంకా జవాబు రావలసి ఉందని ఆ లేఖలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: