పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన రెండు రోజుల నిరాహారదీక్షకు ప్రజల నుంచి స్పందన బాగానే వస్తోంది. ఇలాంటి సభలకు ప్రజలను సమీకరిరంచడంలో రాజకీయ పార్టీలు బాగానే జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే.. ప్రజాస్పందన అంతగా లేనప్పుడు.. వాహనాలు పెట్టినా హాజరయ్యేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపరు.

తణుకు దీక్షకు జన సమీకరణలో మాత్రం వైసీపీ నేతలు బాగానే సక్సస్ అయ్యారు. పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈ రైతు దీక్ష బాగానే ఉపయోగపడుతుంది. జగన్ రైతు దీక్ష.. ఏపీ మంత్రుల్లో కలవరం కలిగించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీక్ష సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించేందుకు మంత్రులు పోటీపడ్డారు. జగన్ ను విమర్శిస్తే అధినేత దృష్టిని కూడా ఆకర్షించవచ్చనుకున్నారో.. ఏమో.. గానీ చాలామంది మంత్రులు దీక్షపై స్పందించారు.

జగన్ నవ్యాంధ్ర నిర్మాణానికి రాళ్లు ఎత్తాల్సిందిపోయి.. రాళ్లు రువ్వుతున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూల్లో విమర్శించారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదన్న జగన్.. కోర్టు ప్రాంగణంలో ఎలా పలకరించుకున్నారని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. జగన్ పనిలేక దీక్షలు చేస్తున్నారని రాజమండ్రిలో మండిపడ్డారు. జగన్ మొదటి నుంచి రుణమాఫీకి వ్యతిరేకంగా ఉన్న సంగతి రైతులకు తెలుసని గుర్తు చేశారు.

ప్రజలు తనను మరచిపోకుండా ఉండేందుకే జగన్ అప్పుడప్పుడు దీక్షలు చేస్తున్నారని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ విమర్శించారు. నెలలో 28 రోజులు సొంత పనులు చూసుకుని.. 2 రోజులమాత్రం జగన్ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు తన చేజారకుండా ఉండేందుకే జగన్ దీక్షలు చేస్తున్నారని మరోమంత్రి పీతల సుజాత ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: