తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తున్నాడు. ఏపీలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పర్వాలేదు.. అయితే ఏపీలోని అధికారం తెలంగాణలో పార్టీని కాపాడ లేకపోతోంది. ఈ నేపథ్యంలో బాబు కొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలోని అధికారాన్ని వాడుకొనే తెలంగాణలో పార్టీ ని కాపాడాలని ఆయన భావిస్తున్నాడని అర్థం అవుతోంది.

రాజకీయాల్లోకి వచ్చిన వారందరి అవసరం అధికారమే! తమ చేతిలో అధికారముండటమే పరమావధిగా రాజకీయాలు చేస్తారు నేతలంతా. ఈ నేపథ్యంలో ఆ పదవులు వారికి దక్కితే పార్టీపై అమితమైన ప్రేమను పంచుతారని బాబు కుతెలియనదేమీ కాదు. అందుకే తెలంగాణ తమ్ముళ్లకు పదవులు దక్కే ఏర్పాటు చేస్తున్నారటాయన.

ఏపీలో అధికారం ఎవరి చేతిలో ఉంటే.. టీటీడీ వారి చేతిలోనే ఉంటుంది. టీటీడీలో నియమాకాలు ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి లభించే వరాలు. ఈ నేపథ్యంలో ఆ నామినేటెడ్ బోర్డులో తెలంగాణ తమ్ముళ్లకు వాటా ఇవ్వాలని భావిస్తున్నాడట. అయితే ఇది చాలా రోజులుగా జరుగుతున్న తతంగం. బాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయిపోయినా.. ఇప్పటి వరకూ టీడీపీ బోర్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

చైర్మన్ ఎంపిక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డులో పదవుల మీద ఆశలు పెట్టుకొన్న టీటీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. బాబు ఇలా ఎన్ని రోజులు ఊరిస్తుంటాడో.. ఎప్పుడు తమకు పదవులు ఇప్పిస్తాడో వారికి అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే... తెలంగాణ టీడీపీ నేతల్లో కొందరిని ఏపీ ద్వారా రాజ్యసభకు పంపుతానని కూడా బాబు హామీ ఇచ్చాడట! ఇలాంటి హామీల ద్వారా తెలంగాణలోని టీడీపీ నేతలను పార్టీకి అంకితమయ్యేలా చూసుకోవాలని బాబు భావిస్తున్నాడు. మరి ఇలాంటి ఊరింపు ఎన్ని రోజులో!

మరింత సమాచారం తెలుసుకోండి: