ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్ని పరామర్శించే లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం జగన్ చిలమత్తూరులో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత లేపాక్షి మండలం మామిడమాకులపల్లిలో కురుబ సిద్ధప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రుణమాఫీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ హామీని సక్రమంగా అమలు చేయకపోవటం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. హిందూపురం లో జరిగిన బహిరంగ సభలో జగన్ చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు..

తన తండ్రి వై.ఎస్. రైతు పక్షపాతిగా పేరు పొందారని.... చంద్రబాబు మాత్రం రైతు వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్ అన్నారు. హిందూపురం పర్యటనలో జగన్ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను కూడా టార్గెట్ చేశారు.. చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా చోట్ల రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని జగన్ కామెంట్ చేశారు.

గతంలో తన పాలనలో ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని చంద్రబాబు ఎన్మోసార్లు చెప్పాడని... ఇప్పుడు తన యాత్ర తర్వాత 29 మంది చనిపోయారని మాట మారుస్తున్నారని జగన్ మండిపడ్డారు. బాబు చెబుతున్నట్టు.... ఒక్కరైతుకు కూడా పూర్తిస్థాయిలో రుణాలు మాఫీకాలేదన్నారు. జగన్.. చేనేత, మహిళా రుణాల మాఫీ అతీగతీలేదని విమర్శించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పూర్తీచేయాలన్న సంకల్పంతో వై.ఎస్. పెద్దమొత్తంలో నిధులు విడుదల చేశారని... ఇప్పుడు చంద్రబాబు మొక్కుబడిగా ఎందుకు కొరగాని రీతిలో నిధులు కేటాయిస్తున్నారని జగన్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: