రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం విడుదల చేసిన 500 కోట్ల రూపాయల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి లోగడ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 5 శాతం ముడుపులు ముట్టాయన్న తమ ఆరోపణకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు.

మీకు ముడుపులు ముట్టకపోతే ముఖ్యమంత్రికి ముట్టాయా? అని వారు సోమవారం విలేఖరుల సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారణకు ఆదేశిస్తే తాము రుజువు చేస్తామని వారు తెలిపారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ కమిటీలో మంత్రి బాధ్యులుగా ఉంటే తనకు సంబంధం లేదని అవాస్తవం చెబుతున్నారని అన్నారు. గత ఏడాది అక్టోబర్ 18న జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ముఖ్యమంత్రిని సూత్రప్రాయంగా ఒప్పించామని చెప్పడంలో అర్థం ఏమిటని వారు ప్రశ్నించారు.

ఆరోపణలు చేసిన వారిపై కోర్టుకు వెళతానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన ప్రకటనను వారు ప్రస్తావిస్తూ తాము ప్రజా కోర్టుకు వెళతామని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: