ఏపీ రాజధాని ప్రాంతంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఓవైపు భూ సమీకరణకోసం తగ్గిపోతున్న గడువు.. ఇంకా పూర్తికాని లాండ్ పూలింగ్.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ పర్యటనలు.. ఒక్కసారిగా ఈ పరిణామాలతో పొలిటికల్ హీట్ రైజ్ అయ్యింది. ఈనెల 28తో భూసమీకరణ గడువు పూర్తవుతోంది. కానీ అనుకున్న లక్ష్యానికి ఇంకా కనీసం 7 వేల ఎకరాల భూమి సమీకరణ పూర్తికాలేదు.

భూసమీకరణ గడువు ఎట్టిపరిస్థితుల్లో పెంచేదిలేదని ఏపీ మంత్రులు తేల్చి చెబుతున్నారు. సాధ్యమైనంతవరకూ గడువులోపలే కావలసిన భూమంతా సేకరిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాస్తో, కూస్తో మిగిలినా దాన్ని భూసేకరణ చట్టం 2013 ద్వారా సేకరిస్తామని చెబుతున్నారు. ఐతే.. భూసేకరణ పేరుతో మంత్రులు రైతులను బెదిరిస్తున్నారని... రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

రాజధాని కోర్ ప్రాంతం కోసం 2 వేల ఎకరాలు సరిపోతుందని.. మిగిలిన భూమిని మాస్టర్ ప్లాన్ వేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా రైతుల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తోందని.. ఇది మంచిపద్దతి కాదని వైసీపీ నేత దర్మాన ప్రసాదరావు అన్నారు. వైసీపీ నేతల యాత్రపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ శాసనసభాపక్ష పర్యటనను దండయాత్రగా, విహార యాత్రగా టీడీపీ మంత్రులు వర్ణించారు.

మంత్రులు, వైసీపీ నేతల పర్యటనల నేపథ్యంలో స్థానిక రైతుల్లో అయోమయం నెలకొంది. భూములు ఇచ్చేసి తప్పుచేశామా అని కొందరు భావిస్తుంటే.. భూములు ఇవ్వనిరైతులు.. ఏంచేయాలా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ భూసేకరణ చట్టం అమలు చేసి తమ భూములు తీసుకుంటే.. అప్పుడు ఎంత వస్తుంది.. ఇప్పుడు పూలింగ్ కు ఇస్తే ఎంత వస్తుంది.. రెండింటిలో ఏది లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: