సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈయన నేపథ్యం గురించి వేరే వివరించక్కర్లేదు. గత పది పన్నెండేళ్లలో వైఎస్ పై న,, వైఎస్ ఫ్యామిలీ పైన ఈయనలా ధ్వజమెత్తిన వ్యక్తులు మరొకరు ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి వైఎస్ పై , ఆయన మరణానంతరం జగన్ పై విరుచుకుపడి విమర్శలు చేసిన వారు ఎంతో మంది ఉండొచ్చు కానీ.. ఈయనలా ఒకే ధాటితో వేరే అజెండా లేకుండా విమర్శలు చేసిన వారు మాత్రం ఎవరూ ఉండరు!

అయితే ఇంతలా కష్టపడుతున్నా సోమిరెడ్డికి దక్కుతున్న ప్రయోజనం ఏమీ లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఈయన గెలవడం లేదు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. వరసగా మూడు సార్లు పోటీ చేసి సోమిరెడ్డి ఓటమిని మూటగట్టుకొన్నాడు. మరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవుతున్నా.. వైఎస్ ఫ్యామిలీపై అంతగా విరుచుకుపడుతున్నా.. ఇప్పటి వరకూ చంద్రబాబు సోమిరెడ్డిపై కరుణ చూపింది లేదు.

ఎమ్మెల్యే కాలేకపోతున్న సోమిరెడ్డికి ఎమ్మెల్సీ కావాలని ఉంది. అందుకోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. మండలి పునరుద్ధరణ జరిగినప్పటి నుంచి కూడా సోమిరెడ్డి ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అవేవీ ఫలవంతం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోమిరెడ్డి ప్రయత్నాలు మరోసారి పీక్ కు చేరాయి. ఇన్ని రోజులూ పడిన కష్టానికి గానూ తనకు అవకాశం ఇవ్వాలని సోమిరెడ్డి బాబును కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతానికి మాత్రం రెడ్డి గారి ఆశలు అంత ఈజీగా నెరవేరే అవకాశం లేదని సమాచారం. ఓడిపోయిన వారికి ఎలా ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు? అని తెలుగుదేశంలోని ఒక వర్గం ప్రశ్నిస్తోందట. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి కానీ.. ఇలా ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారట. ఆ లాజిక్ కూడా బాగానే ఉంది. మరి బాబు కూడా అదే లాజిక్ ను ఫాలో అయితే.. సోమిరెడ్డిలా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకొన్న వారికి ఆశాభంగం తప్పదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: