విభజన చట్టం హామీలు మరిచిపోయారు. రెవెన్యూలోటు పూడుస్తామన్నా పట్టించుకోవడం లేదు.. రాజధానికి నిధులిస్తామన్నారు.. రూపాయి కూడా రాల్చడం లేదు. మోడీ-బాబు అధికారంలోకొస్తే ఆకాశాన్నే నేలకు దించుతామన్నారు.. ఇప్పుడంత సీన్ లేదు.. ఇవీ.. ఇన్నాళ్లూ కేంద్రంపై ఆంధ్రాజనం చేసిన విమర్శలు..

ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానంగా అన్నట్టు కేంద్రం ఏపీపై నిధుల వర్షం కురిపించబోతోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రాకు కేంద్రం అండగా నిలవాలని నిర్ణయించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకూ మొత్తం ఐదేళ్లలో కేంద్రంలో పన్నుల వాటాగా ఏపీ సర్కారుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు అందనున్నాయి. అంతేకాదు.. ఐదేళ్లలో రూ.36,588 కోట్లు గ్రాంట్లుగా అందించాలని నిర్ణయించింది.

ఐతే.. దీంతో ఏపీ జనం అంతగా చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదంటున్నారు విమర్శకులు.. ఇది ఏపీపై ప్రత్యేకంగా ప్రేమ చూపించినట్టు కాదని వారు చెబుతున్నారు. సాధారణంగా రెవెన్యూలోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు అందిస్తుందని వారు చెబుతున్నారు. ఏపీతో పాటు, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ వంటి 11 రాష్ట్రాలకు కూడా నిధులు అందిస్తున్న సంగతి మరచిపోకూడదని గుర్తు చేస్తున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 42 శాతానికి పెంచడంపట్ల ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకునేందుకు యత్నిస్తామన్నారు.

14వ ఆర్థికసంఘం సిఫార్సులు తెలంగాణను నిరాశకు గురి చేశాయి. దీని ప్రకారం తెలంగాణకు కేవలం 15 వేల కోట్లు మాత్రమే గ్రాంటుగా అందే అవకాశం ఉంది. అంతేకాదు కేంద్రపన్నుల వాటాలో తెలంగాణ శాతం గతం కంటే తగ్గనుంది. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సాధారణ పన్నుల్లో 2.437%, సర్వీస్ టాక్స్‌లో 2.499% వాటా రానుంది. ఈ పన్నుల్లో అన్నింటికంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు 17.959%, 18.205% చొప్పున లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇది 4.305%, 4.398% చొప్పున ఉంటుంది. నిజానికి ఈ ఐదేండ్ల కాలానికి స్థానిక సంస్థలకు రూ.20,951 కోట్లు కావాలని ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరగా అందులో సగం కూడా సిఫారసు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: