సమాచార హక్కు చట్టం.. ఇప్పుడిది ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా పని చేస్తోంది. ఎలాంటి సమాచారమైనా... అది ఎంతటి పలుకుబడి గల నేతకు సంబంధించినదైనా.. ఈ అస్త్రం సంధింస్తే సమాచారం చెప్పాల్సిందే. దీని ఆధారంగానే అనేక కుంభకోణాలు, గూడుపుఠాణీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా ఆస్తులు వివాదాస్పదమైన నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక ఆస్తుల విషయం కూడా కొత్తమలుపులు తిరుగుతోంది.

ఐతే.. ఈ సమాచార హక్కు చట్టానికీ కొన్ని మినహాయింపులున్నాయి. మొన్నటికి మొన్న నేతాజీ మరణం విషయంలోనూ ఆ రహస్యాన్ని దేశ భద్రత దృష్ట్యా చెప్పలేమని పీఎంఓ ఓ సమాచారహక్కు కార్యకర్తకు చెప్పేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విషయంలోనూ అలాగే జరుగుతోంది. ప్రియాంకా గాంధీ ఆస్తుల వివరాలను రాబట్టేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం ప్రస్తుతానికి విఫలమైంది.

ప్రియాంకా గాంధీకి హిమాచల్ ప్రదేశ్ లో చాలా ఆస్తులున్నాయి. ఐతే.. ఆ వివరాలు బయటపెట్టాలని కోరుతూ దేవాశిష్ భట్టాచార్య అనే వ్యక్తి హిమాచల్ సర్కారును సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుపెట్టుకున్నారు. ఐతే ఇలా ఆస్తులు వెల్లడించడానికి అనేక నిబంధనలు అడ్డున్నాయంటూ హిమాచల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై దేవాశిష్ భట్టాచార్యకు ప్రభుత్వానికి అనేక ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో తన ఆస్తుల వివరాలు బయటపెట్టవద్దని ప్రియాంకా గాంధీ హిమాచర్ ప్రదేశ్ సర్కారుకు ఉత్తరం రాశారు. ఆ వివరాలు బయటపెడితే అది తన ప్రాణాలకే ముప్పని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ప్రియాంకా విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రభుత్వం.. ఆమె ఆస్తులు వెల్లడించలేమని దేవాశిష్ కు తెలిపారు. ప్రియాంక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణ ఉన్న వ్యక్తి అని.. ఆమె ఆస్తులు వెల్లడించలేమని దేవాశిష్ కు తెలిపింది హిమాచల్ సర్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: