అనాథలు, అభాగ్యులకు ఎనలేని సేవలందించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నోబెల్‌ పురస్కార గ్రహీత, 'భారతరత్న' మదర్‌ థెరిస్సాపై సంఫ్‌ు పరివార్‌ దాడికి దిగింది. కుష్టురోగుల వంటి దీనజనులను కూడా తల్లిలా ఆదరించి ఆదుకున్న మానవతామూర్తిపై ఇప్పుడు దుష్ప్రచారం మొదలుపెట్టింది. మత మార్పిడి కోసమే పేదలసేవ చేశారని రాష్ట్రీయ స్వయం సేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగవత్‌ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పత్రికలు, మీడియా, సోషల్‌ వెబ్‌సైట్లలో చర్చలకు దారి తీశాయి. భగవత్‌ వ్యాఖ్యలను కోల్‌కతాలోని మదర్‌ థెరిస్సా సంస్థతోపాటు, బృందాకరత్‌, కేజ్రీవాల్‌ తదితరులు మంగళవారం ఖండించారు. దరిమిలా భగవత్‌ మాటలను మీడియా వేరేవిధంగా ప్రచారం చేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో 'అప్నాఘర్‌' అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో భగవత్‌ ప్రసంగిస్తూ, పేదలకు మదర్‌ చేసిన సేవలు మంచివేననీ, అయితే మతమార్పిడి లక్ష్యంగా సేవలు చేశారనీ, సేవలు పొందినవారిని క్రిస్టియన్‌ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించారని అన్నారు. మతమార్పిడి అన్నది సమస్య కాదు. కానీ అభా గ్యులకు సేవల పేరుతో మతం మార్చడం అభ్యంతరకరమన్నారు. చేసిన సేవలను మత మార్పిడికి వినియోగించుకోవడం వల్ల అటువంటి సేవల విలువ పడిపోతుందన్నారు. భగవత్‌ వ్యాఖ్యలపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ వివరణ ఇచ్చింది. భగవత్‌ వ్యాఖ్యలను మీడియా పొరపాటుగా ప్రచారం చేసిందని తన ట్విటర్‌లో పేర్కొంది. బిఎస్‌ఎఫ్‌ మాజీ డిజిపి ప్రకాశ్‌సింగ్‌ భరత్‌పూర్‌ సభలో మాట్లాడుతూ, పేదలకు సేవల పేరుతో కొన్ని సంస్థలు మతమార్పిడికి పాల్పడుతున్నాయని అన్నారనీ, డిజిపి వ్యాఖ్యలపై భగవత్‌ ప్రతిస్పందించారని తెలిపింది. 'తన సేవల ఉద్దేశమేమిటో మదర్‌ థెరిస్సాకు తెలుసు. మనం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తామ'నిమాత్రమే భగవత్‌ అన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. కాగా, కోల్‌కతాలోని మదర్‌ థెరిస్సాకు చెందిన మిషనరీ ఆఫ్‌ చారిటీస్‌ సంస్థ స్పందిస్తూ 'భగవత్‌కు మాపై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్లున్నారు. ఆయన మా సంస్థకు వచ్చి నిజాలు తెలుసుకోవాలి. మత ప్రమేయం లేకుండా మేము పేదలకు సేవలు అందిస్తున్నాం. పేదలపట్ల మదర్‌ ప్రేమ గురించి దేశానికంతా తెలుసు'నని పేర్కొంది. సంస్థ ప్రతినిధి సునీతాకుమార్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

భగవత్‌ వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఖండిస్తూ, మదర్‌ వంటి వారిపై ఎలాంటి వ్యాఖ్యలు తగవన్నారు. తాను వారి ఆశ్రమంలో ఆమెతో కలిసి కొన్ని నెలలపాటు పని చేశాననీ, ఆమె ఉదారమూర్తి అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ వ్యాఖ్యలతో ప్రజలను మతపరంగా విభజించాలను కుంటున్నదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డీఒబ్రియెన్‌ కూడా భగవత్‌ వ్యాఖ్యలను ఖండించారు. మత సమసామర్యం కోసం ప్రధాని ఇటీవల ఇచ్చిన పిలుపును తిప్పికొట్టాలని సంఫ్‌ుపరివార్‌ ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ అర్చిబిషప్‌ అనిల్‌ కోటో అన్నారు.

భగవత్‌పై ట్విటర్‌లోనూ విమర్శలు వచ్చాయి. మత మార్పిడి కోసమే క్రిస్టియన్లు సేవలు చేసున్నారనుకుంటే, మరి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తమ పిల్లలను, బంధువులను క్రిస్టియన్‌ మిషనరీలు నిర్వహించే విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలకు పంపించడం మానేస్తారా అని ఒకరంటే, మదర్‌ అనాధలైన కుష్ఠురోగులకు కూడా సేవలందించారనీ, రోగులు ఆమెలో దైవాన్ని చూశారనీ, అందులో తప్పేం ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్న కిరణ్‌బేడీ, భగవత్‌ వ్యాఖ్యలను ఖండించాలని ఒకరు కోరగా, ప్రపంచశాంతికి మీరేమీ పాటు పడతారూ, మీ ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి అని ఒకరు వ్యంగ్యాస్త్రం సంధించారు. హిందూ నాయకులు ఏం మాట్లాడవద్దు. దేశాభివృద్ధి ముఖ్యం కానీ, మతం కాదని ఒకరన్నారు. హిందూ సన్యాసులు కూడా అదే పని చేస్తున్నారు కదా మరో వ్యక్తిదుయ్యబట్టాడు. మదర్‌ ఉంటే భగవత్‌కు తగిన సమాధానం ఇచ్చేవారని ఒకరు రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: