ఓదార్పు యాత్రపై వైఎస్సార్ సీపీకి పేటెంట్ హక్కు ఉందనుకోవచ్చు. వైఎస్ మరణం తట్టుకోలేక గుండె ఆగి మరణించిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు మొదలుపెట్టిన ఈ యాత్ర సూపర్ సక్సస్ అయిన సంగతి తెలిసిందే. జగన్ కు విపరీతమైన ప్రజాదరణ తెచ్చి పెట్టిన యాత్ర ఇది. బుగ్గలు నిమురుతూ.. నెత్తిన చేతులుపెడుతూ.. ప్రేమగా పలకరిస్తూ.. తనదైన మార్కు సంపాదించుకున్నాడు యువనేత.

సొంతమీడియా చేతిలో ఉండటం.. ప్రజల్లో సానుభూతి ఉండటంతో ఈ యాత్రలు సూపర్ సక్సస్ అయ్యాయి. ఇప్పుడు అధికారం టీడీపీ చేతచిక్కిన సమయంలో మళ్లీ రాజకీయంగా పుంజుకునేందుకు జగన్ యాత్రనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఊరికే ఓదార్పు అంటే బావుండదు కనుక.. ఈ సారి రైతు ఓదార్పు యాత్రలు మొదలుపెట్టారు. ఎలాగూ రైతులు కష్టాల్లో ఉన్నారు.. అందులోనూ రుణమాఫీ పూర్తికాలేదు కనుక ఇది కూడా బాగానే వర్క ఔట్ అవుతోంది.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఓదార్చాల్సిన రైతు కుటుంబాల ఎంపికలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం జగన్ పార్టీని ఇబ్బందుల్లో పెడుతోంది. అనంతపురం జిల్లాలో ఆయన ఓదార్చిన ఓ కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ నేపథ్యంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ అనంతపురం జిల్లాలో సురేష్ అనే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అయితే సురేష్ అనే వ్యక్తి కేవలం ఓ ఆటో డ్రైవర్ అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అంతే కాకుండా సురేష్ ఓ తాగుబోతని.. గ్రామంలో అతనికి ఏమాత్రం మంచిపేరు లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అంతే కాదు.. జగన్ ఆ ఊరికి వచ్చినప్పుడు.. ఇలాంటి యాత్రలు చూడలేమంటూ గ్రామంలోని చాలామంది ఇళ్లకు తాళాలు వేసి మరీ వెళ్లిపోయారట. రైతు ఓదార్పు యాత్రలకు జనం బాగానే వస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో... ఆత్మహత్య కేసుల విషయంలో జగన్ టీమ్ కాస్త అప్రమత్తంగా ఉంటే బెటరేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: