వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలవి భిన్నమైన విధానాలు.. ఈ మూడు పార్టీల మధ్య ఎలాంటి సారూప్యత లేదు. వివిధ సందర్భాల్లో ఈ మూడు పార్టీలూ ఒకదానిపై మరోటి దుమ్మెత్తిపోసుకొంటుంటాయి. అయితే.. ఇప్పుడు ఈ పార్టీలూ ఒక విషయంలో మాత్రం ఏకమయ్యాయి. ఇది ఫిరాయింపుదారుల వ్యవహారంలో..! ఎలాగైనా తమ పార్టీల నుంచి తెరాస వైపు వెళ్లిన వారిని అనర్హులుగా చేయాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ విషయంలో ఈ మూడు పార్టీలూ ఉమ్మడిగా ముందుగా సాగుతుండటం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ల తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ ఎన్నికల్లో మెజారిటీ ని సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెరాసలో చేరిపోయారు. అధికార పార్టీలో భాగస్వామ్యులయ్యారు.

తమ పార్టీల గుర్తులపై గెలిచిన వాళ్లు అలా జంపింగ్ లు చేసే సరికి ఈ మూడు పార్టీలూ సహించలేకపోతున్నాయి. వారిని అనర్హులుగా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో మొదట చట్ట ప్రకారం స్పీకర్ ను ఆశ్రయించారు. అయితే అసెంబ్లీ స్పీకర్ కూడా అధికార పార్టీ వ్యక్తే కావడంతో వారిపై ఇప్పటి వరకూ చర్యలు లేకుండా పోయాయనేది ఈ పార్టీ ఆరోపణ. అందుకే స్పీకర్ పై ఒత్తిడి తీసుకురావడానికి కోర్టుకు వెళ్లాయి ఈ పార్టీలు.

వీరి పిటిషన్ ను హై కోర్టు విచారించింది.. అయితే స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయడానికి కోర్టు సుముఖత చూపలేదు. దీంతో ఈ మూడు పార్టీలూ ఉమ్మడిగా హై కోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మరి ధర్మాసనం ఎలా స్పందిస్తుందో.. ఫిరాయింపు దారుల విషయంలో స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు చేస్తుందో.. అనేది ఆసక్తి కరంగా ఉంది. మరి అంతిమంగా ఈ మూడు పార్టీల ఉమ్మడి పోరుకు ఎలాంటి ఫలితం దక్కుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: