మొత్తానికి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. భూ సేకరణ చట్టం సవరణలను ఆమోదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు చుక్కలు చూపుతున్నాయి. ఎలాగైనా ఈ బిల్లును అడ్డుకొంటామని ప్రతిపక్ష పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కారుకు ఎలాంటి సహకారం అందించేది లేదని అవి స్పష్టం చేస్తున్నాయి.

ఆఖరికి ఎన్డీయేలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీలు కూడా భూ సేకరణ విషయంలో ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. శివసేన వంటి పార్టీలు ఈ విషయంలో తమ వ్యతిరేకతను బహిరంగంగాప్రకటించాయి. దీంతో ఇప్పుడు బీజేపీకి ఇబ్బందులు తప్పడం లేదు. మరి ఈ ఎపిసోడ్ లో తెలుగు పార్టీల తీరు ఏమిటి? అంటే... తెలుగుదేశం పార్టీ చాలా సైలెంట్ గా ఉంది.

భూ సేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పుల వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని అనేక మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా.. తెలుగుదేశం ఎంపీలు మోడీ సర్కారుకు దన్నుగా నిలుస్తోంది. ఇక తెరాస వాళ్లు ఏదో హడావుడి చేయబోయారు కానీ.. వీరు ఆ బిల్లును గట్టిగా వ్యతిరేకించడం లేదు.

అయితే వైకాపా మాత్రం ఈ బిల్లు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ సవరణల వల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వైకాపా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో నిరసన తెలుపుతూ.. వైకాపా లోక్ సభ నుంచి వాకౌట్ చేయడం విశేషం. మరి ఇక్కడ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. రైతుల ప్రయోజనాలు ముఖ్యం. అన్నా హజారే వంటి వారు కూడా ఈ బిల్లు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎవ్వరినీ పట్టించుకోకపోవడం.. తనకు ఇష్టమైనట్టుగానే సాగుతుండటమే ఇక్కడ ఆశ్చర్యకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: