రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు ఆంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటు ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రతిపాదించే 2015-16 రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రకు కొత్త జోన్ ప్రకటించక పోవచ్చని అంటున్నారు. అలాగే, రెండు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రకు కొన్ని ప్రత్యేక రైళ్లు, తెలంగాణకు రైల్వే పథకాలు వినా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు గిట్టుబాటు అయ్యేది ఉండకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జోన్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికలో ప్రతికూల సిఫార్సులు చేసినట్టు తెలిసింది.

జోన్ ఏర్పాటుకు తగిన ఆదాయం, ప్రయాణికుల సంఖ్య లేదని నివేదికలో అభిప్రాయపడినట్టు సమాచారం. దీంతో జోన్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ఇతర రైల్వే పరిశ్రమలు ఏవైనా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ -కొత్త ఢిల్లీ మధ్య నడుస్తున్న ఏపి ఎక్స్‌ప్రెస్‌ను ఆంధ్రకు కేటాయించి, తెలంగాణకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు కేటాయించటం లేదా ఇప్పుడు నడుస్తున్న ఏపి ఎక్స్‌ప్రెస్ రైలుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేసి ఆంధ్రకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. దీంతోపాటు మరికొన్ని రైళ్లు, రైల్వే పథకాలను ప్రకటించవచ్చని అంటున్నారు.

తమ రాష్ట్రానికి సంబంధించి కొత్త రైల్వే జోన్‌తోపాటు కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇదే సమయంలో తెలంగాణ సైతం రైల్వేకు సంబంధించి పలు పథకాలు కోరుతూ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రలో రైల్వే జోన్‌తోపాటు రైల్వే వర్శిటీ, కోస్తా రైల్వే కారిడార్‌ను సాగరమాల పథకంలో చేర్చాలని డిమాండ్ చేసింది. నర్సాపురం- మచిలీపట్నం- బాపట్ల వరకూ రైల్వే లైన్ నిర్మించాలని, కడప- బిట్రగుంట రైల్వే లైను నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతోంది. తిరుపతి, ఖాజీపేటలను ప్రత్యేక డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నది రెండు రాష్ట్రాల డిమాండు. విజయవాడను ఆదర్శ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని, రైల్వే నీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లలో అంతర్జాతీయ వసతులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖాజీపేటలో రైల్వే వ్యాగన్ల నిర్మాణ కర్మాగారం, రేణిగుంట సిఆర్‌ఎస్‌ను పూర్తి సామర్థ్యానికి పెంచాలన్న డిమాండ్ ఉంది.

గుంతకల్లులో ఎలక్ట్రిక్ లోకో షేడ్‌ను ఏర్పాటు చేయటంతోపాటు, కర్నూలులో కోచ్ కర్మాగారం నిర్మాణాన్ని బడ్జెట్‌లో చేర్చాలన్నది రెండు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్. హైదరాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశకు నిధులు కేటాయించాలని, కొత్తపల్లి- మనోహరాబాద్ లైను పూర్తి చేయాలని, ఏపి ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం నుంచి కొత్త ఢిల్లీ వరకూ నడిపించాలన్న డిమాండ్లు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదించిన బుల్లెట్ రైళ్ల మార్గంలో చెన్నై, విశాఖను చేర్చాలన్న డిమాండ్ కూడా ఉంది. తిరుపతి, గుంటూరు, విజయవాడ మీదుగా శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేయాలనేది మరో డిమాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నత్తనడక నడుస్తున్న 29 ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని, ఏటా రైల్వే బడ్జెట్‌లో నాలుగు వేల కోట్లు కేటాయించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు పలు పథకాలు డిమాండ్ చేస్తున్నా, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎన్ని పథకాలు, ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది ప్రశ్నార్థకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: