ప్రజానాడిని పట్టుకోవడం అంత సులభం కాదు.. నమ్మి నెత్తిన పెట్టుకుని ఓట్లవర్షం కురిపించివాళ్లే.. తేడా వస్తే.. అదే ఓటుతో బుద్ది చెబుతారు. కాకపోతే.. మన ఎన్నికల వ్యవస్థలో ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి నేతలు బతికిపోతున్నారు. అదే ఏడాదికోసారి ఎన్నికలొస్తే.. అధికారం ఎన్ని చేతులు మారుతుందో..

ప్రజా చైతన్యానికి మొన్నటి ఢిల్లీ ఎన్నికలే ఓ ఉదాహరణ.. మొత్తం 70 సీట్లకు 32 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏడాది తిరగకుండానే కేవలం 3 స్థానాలకు పడిపోయింది. 28 స్థానాల్లో రెండో ప్లేస్ లో ఉన్న ఆప్ ను 67 స్థానాలు గెలిపించి జనం నెత్తినపెట్టుకున్నారు. మోడీ ఓవరాక్షన్ కు.. కేజ్రీవాల్ చిత్తశుద్ధికి ఢిల్లీ ఓటర్లిచ్చిన విలక్షణ తీర్పుగా విశ్లేషకులు దీన్నిఅంచనా వేశారు.

ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో ఎన్నికలొస్తే ఏం జరుగుతుంది. అధికార టీడీపీని జనం చిత్తుగా ఓడిస్తారా.. ప్రతిపక్ష వైకాపాను ఢిల్లీ ఆప్ తరహాలో నెత్తిన పెట్టుకుంటారా.. ప్రస్తుతానికి ఎన్నికలొచ్చే అవకాశం లేకపోయినా.. వస్తే మాత్రం అలాగే జరుగుతుందని వైసీపీ అధినేత జగన్ ఊహిస్తున్నారు.

ఎన్నో హామీలు గుప్పించి.. అబద్దాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ అంటున్నారు. అనంతపురం జల్లాలో జరిగిన రైతు భరోసా యాత్ర సందర్భంగా చంద్రబాబు పాలనపై ఆయన నిప్పుల వర్షం కురిపించారు. చంద్రబాబు అబద్దాలు నమ్మి జనం ఓట్లేశారని.. ఇప్పుడు ఎందుకు ఓట్లేశామా అని బాధపడుతున్నారని జగన్ అంటున్నారు. ఢిల్లీ తరహాలో ఆంధ్రాలోనూ ఎన్నికలు జరిగితే.. బీజేపీకి పట్టిన గతే చంద్రబాబుకూ పడుతుందని జోస్యం చెబుతున్నారు. ఇది విన్న టీడీపీ నేతలు మాత్రం నవ్వుకుంటున్నారు. చంద్రబాబు సర్కారుకు ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదని.. పిల్లి శాపాలకు ఉట్లు తెగనట్టే..జగన్ కోరిక ఇప్పట్లో తీరదని వెటకారం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: