పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ మొండి చెయ్యే మిగిలింది. ఆదాయంలో అగ్రభాగాన నిలిచే దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన కేటాయింపుల విషయం లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. విభజన నేపథ్యంలో తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించిన రెండు రాష్ట్రాలకు అంతులేని నిరాశే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న రైల్వే జోన్‌ తది తర హామీలన్నింటినీ కేంద్రం బుట్టదాఖలా చేసింది. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, ప్రత్యేక జోన్‌ వంటివాటిని కేం ద్రం మంజూరు చేస్తుందనే ఆశతో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర రైల్వే బడ్జెట్‌ ఖంగుతినిపించినట్లయ్యింది. ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న కొత్త రైల్వే లైన్లకు మోక్షం కలుగుతుందని ఆశించిన రెండు రాష్ట్రాలకూ తీరని అన్యాయమే మిగిలింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పలు పెండింగ్‌ ప్రాజెక్టులు ఉన్నా వాటిని పూర్తి చేసేందుకు అవసరైన నిధులను కేటాయించ లేదు. అయితే దక్షిన మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2,768 కోట్ల రూపాయలను మాత్రం కేటాయించింది. గత ఏడాది కంటే 24 శాతం కేటాయింపులు పెరిగినట్లయ్యింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్యాసింజర్‌ సదుపాయాల నిమిత్తం 29 కోట్ల రూపాయలు, 29 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు కొత్త పనులు, రైల్వే వంతెనల నిర్మాణానికి 1,587 కోట్ల రూపాయలు, 38 కొత్త రైల్వే వంతెలను కేంద్రం ఈబడ్జెట్‌లో మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా గుర్తించిన విజయవాడ-గుంటూరుకు సంబంధించి ఎక్కడా రైల్వే విస్తరణ, కొత్త రైళ్లు వేయకపోవడం, రైల్వే జోన్‌ విషయమై కేంద్రం పూర్తిగా విస్మరించింది.

కేవలం కాజీపేట్‌-విజయవాడ మధ్య మూడో లైన్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొంది. దీంతోపాటు నంధ్యాల-ఎర్రగుంట్ల పల్లికి 130 కోట్ల రూపాయలు, నడికుడి-శ్రీకాళహస్తికి 110 కోట్ల రూపాయాలు, విజయవాడ-భీమవరం-నిడదవోలు లైన్‌ డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ నిమిత్తం 150 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ కొత్తలైన్‌ నిర్మాణానికి 141 కోట్ల రూపాయలు, మనోహరాబాద్‌-కొత్తపల్లి లైన్‌కు 20 కోట్ల రూపాయలు, మేళ్లచెర్వు-విష్ణుపురం లైన్‌కు 100 కోట్ల రూపాయలు, సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ లైన్‌ డబ్లింగ్‌ పనులకు 1,200 కోట్ల రూపాయలును కేటాయించింది. కొత్త రైల్వే లైన్ల మంజూరు గూర్చి ఎక్కడా ప్రస్తావించకపోవడం పట్ల అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించారు. కాగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రతీసారీ అన్యాయమే జరుగుతోందనే విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. ప్రజా ప్రయోజనం కోసం కాకుండా లాభాపేక్షతో రైలు మార్గాలను వేస్తున్న కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర అవసరాల పట్ల మొండివైఖరి అవలంబిస్తోంది. ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రైల్వే అవసరాలను తీర్చేలా కేంద్రంపై వత్తిడి తేవడంలో వీరు ఘోరంగా విఫలమవుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి తగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు,

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఆయా రాష్ట్రంలో రైల్వే అవసరాలు, పెండింగ్‌ ప్రాజెక్టుల విషయమై తగినంత శ్రద్ధ కనపచడం లేదని, అదేసమయంలో మోడీ ప్రభుత్వంపై వత్తిడి కూడా తీసుకురాలేకపోయారని, అందువల్లే రెండు రాష్ట్రాలను గూర్చి అసలు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రతిపాదించిన కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, విద్యుద్దీకరణ తదితర వాటికి అవసరమైన నిధులను కేటాయించకుండా కేంద్రం వివక్షత చూపించిందనే విమర్వలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా రైల్వే మార్గాలు పెరగడం లేదని ఇప్పటికే అభిప్రాయం ఉంది. దక్షిణ మధ్య రైల్వే 5,810 కిలోమీటర్ల మేర మార్గాలతో దేశంలో మూడవ స్థానంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం దీని పరిధిలోకి రాలేదు. విశాఖపట్నం డివిజన్‌, గూడూరును ఈజోన్‌లో కలపాలని గతం నుండీ డిమాండ్‌ ఉంది. దీంతోపాటు ప్రధానంగా మెదక్‌ జిల్లా కేంద్రంతోపాటు, భద్రాచలం, అమలాపురం, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట్‌ పార్లమెంట్‌ స్థానాలకు రైలు మార్గం మంజూరు చేయాలని కోసం గతం నుండి ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎక్కువ రెవెన్యూ డివిజన్లకు ఇప్పటికీ రైలు మార్గాలు విస్తరించ లేదు. విశాఖపట్నం నుండి భద్రాచలం మీదుగా వరంగల్లు, రాజమండ్రి నుండి భద్రాచలం, హైదరాబాద్‌ నుండి మాచర్ల, పొదిలి మీదుగా ఒంగోలు,

ఒంగోలు నుండి నర్సరావుపేట్‌, సత్తెనపల్లి మీదుగా అచ్చంపేట్‌, ఒంగోలు నుండి రాయచోటి మీదుగా బెంగుళూరు, నెల్లూరు నుండి పొద్దుటూరు, నంద్యాల మీదుగా ఆత్మకూరు, గూడూరు నుండి రాజంపేట్‌, రాయచోటి మీదుగా కనిగిరి, రాయదుర్గ నుండి నంధ్యాల, బళ్లారి నుండి మాచర్ల, కదిరి నుండి పొద్దుటూరు, ఖమ్మం నుండి చింతలపూడి, జంగారెడ్డిగూడెం మీదుగా నిడదవోలు, చల్లపల్లి నుండి తిరువూరు మీదుగా రైల్వే లైన్లను వేయాలని దశాబ్దాల తరబడి డిమాండ్లు ఉన్నాయి. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌, కాకినాడ మెయిన్‌ రైల్వేలైన్‌ ఈ రెండూ రైల్వే ప్రాజెక్టులూ కోనసీమవాసుల చిరకాల వాంఛ. 2000 నవంబర్‌లో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు పునాదిరాయి పడినా దానికి అతీగతీ లేకుండా పోయింది. మచిలీపట్నం నుండి గుడివాడ, ఏలూరు, గన్నవరం మీదుగా విజయవాడకు సర్య్కూట్‌ రైలును ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో కోరుతున్నారు. ఇవి కాకుండా ఇంకా పలు రైల్వే లైన్లు, కొత్త రైళ్ల అవసరం రాష్ట్రానికి ఉందని వాటికి సంబంధించి ప్రతిపాదనలు చేసి ఏళ్లతరబడి కావస్తున్నా 2015-16 రైల్వే బడ్జెట్‌లో వాటిని విస్మరించింది. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూసిన తెలుగు ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: