ఢిల్లీకి రాజా అయినా.. తల్లికి కొడుకేనంటారు. ఓ పల్లెటూళ్లో పుట్టి జిల్లా, రాష్ట్రం ఖ్యాతిని దేశమంతటా చాటితే.. ఆ వ్యక్తి గురించి ఆ గ్రామం ఎంతగా గర్వపడుతుంది. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు పరిస్థితి కూడా అదే. తెలుగు వెండితెర వేల్పు, తెలుగు రాజకీయాలను కొత్తపుంతలు తొక్కించిన నందమూరి తారక రామారావు స్వగ్రామం అది.

ఎన్టీఆర్ సొంత గ్రామంగా ఇప్పటికే నిమ్మకూరు అభివృద్ధి చెందింది. గ్రామంలో మౌలిక సదుపాయాలు సమకూరాయి. ఇప్పుడు పాత సౌకర్యాలతో పాటు సరికొత్తగా నిరంతర విద్యుత్ వెలుగులు ఊరివాసులకు సంతోషం పంచుతున్నాయి. ఈ గ్రామంలోని సాధారణ వీధిదీపాలకు బదులు సౌర విద్యుత్ దీపాలు అమర్చడమే ఈ మార్పుకు కారణం.

ఇప్పుడు ఏపీతో పాటు దేశమంతా సౌర విద్యుత్ వైపే చూస్తోంది. ఆంధ్రా సీఎం చంద్రబాబు కూడా సౌర విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడి సొంత గ్రామం కూడా ఈ సౌర వెలుగులకు చిరునామాగా మారింది.

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో తన ఎంపీ నిధుల నుంచి ఈ సౌకర్యం సమకూర్చారు. సంక్రాంతి నుంచి ఈ గ్రామంలో సౌర వెలుగులు విరజిమ్ముతున్నాయి. హరికృష్ణ నిధులతో నెడ్ క్యాప్ సంస్థ వీటిని గ్రామంలో ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భూమిలోనే లైన్లు వేశారిక్కడ. అంతేకాదు.. వర్షాకాలంలోనూ ఈ విద్యుత్ వెలుగులకు ఇబ్బంది ఉండదు. ఎండ రాకపోయినా మూడు రోజుల పాటు దీపాలు వెలుగుతాయి. అంతేకాదు.. విద్యుత్ తో ఈ ప్యానళ్లను రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: