ఆట అంటేనే విజయం, పరాజయం ఒకోసారి విజయలక్ష్మి మనల్ని వరిస్తే అదే విజయలక్ష్మి ఎదుటి వాడిని వరిస్తుంది. అన్నింటా విజయం పొందాలని ప్రతి ఆటగాడు తపిస్తూనే ఉంటాడు. కానీ గెలుపు ఓటమిలు సహజమే.. ఇటీవల భారత్ తో ఆడి సఫారీల జట్టు ఘోర పరాజయం పాలయ్యారు. మరి జింబాబ్వేపై వెస్టిండీస్ రికార్డుల మోత మోగించి ఘనవిజయం సాధించింది. అంతేందుకు గేల్ ప్రపంచ రికార్డునే తన కైవసం చేసుకున్నాడంటే ఏ రేంజ్ లో ఆడి ఉంటారో ఊహించండి.

ఇప్పుడు అవే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడగా వాటి రాత పూర్తిగా తారుమారైంది. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో విండీస్ పై ఘనవిజయం సాధించింది. 409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్లు 33.1 ఓవర్లలో 151 పరుగులకు చాపచుట్టేశారు. విండీస్ కెప్టెన్ హోల్డర్ (56) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. రెండో ఓవర్లో క్రిస్ గేల్ (3) ఓటమితో విండీస్ పతనం ఆరంభమైంది. అబాట్ వరుస ఓవర్లలో గేల్, శామ్యూల్స్ ను అవుట్ చేయడంతో విండీస్ కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5 వికెట్లు) విండీస్ బ్యాటింగ్ లైనప్ ను పేకమేడలా కూల్చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది.

డివిల్లీర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు. అతని దూకుడుతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ కేవలం 33.1 ఓవర్లకే 151 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో డివిల్లీర్స్ పలు రికార్డులు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులు. డివిల్లీర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. గతంలో ఇది షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) పేరి ఉంది.

2011లో బంగ్లాదేశ్ పైన 83 బంతుల్లో 150 పరుగులు చేశాడు. అలాగే 16 బంతుల్లో 50 పరుగులు, 31 బంతుల్లో 100 పరుగుల రికార్డ్ కూడా సృష్టించాడు. డివిల్లీర్స్ (66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 నాటౌట్) మెరుపు సెంచరీతో రెచ్చిపోగా, ఆమ్లా (65), డుప్లెసిస్ (62), రోసౌ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వన్డేల్లో డివిల్లీర్స్ కిది 20వ సెంచరీ. గేల్, రసెల్ రెండేసి వికెట్లు తీశారు. సఫారీల ఇన్నింగ్స్ జడివానతో మొదలై భారీ వర్షంగా మారి చివరకు వరదలా తీవ్రరూపం దాల్చి కరీబియన్లను ముంచెత్తింది. డివిల్లీర్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: