గుంటూరు జిల్లాలోని నూతన రాజధాని ప్రాంతంలో రాజకీయ వైషమ్యా లు రోజురోజుకు కొత్తరూపంలో పురివిప్పుతు న్నాయి. అధికార, ప్రతిపక్ష రాష్ట్ర నాయకుల పోటా పోటీ యాత్రలు కిందిస్థాయి నాయకులను రెచ్చగొట్టే దిశగా మళ్లుతున్నాయి. భూ సమీకరణను వ్యతి రేకిస్తున్న ప్రాంతాల్లో ఏ క్షణాన ఏమి జరుగు తుందోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. కొన్ని సామాజికవర్గాల మధ్య విభేదాలు పెచ్చి రిల్లిపోయి పెనువివాదాలుగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

బుధవారం అర్ధరాత్రి తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఓ ఉదాహరణ. ఎన్నికష్టాలైనా భరిస్తాం.. రాజధాని నిర్మించి తీరుతామంటూ కొందరు ఉండవల్లి ప్రాంతంలో ప్లెక్లీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ నేతలు భూములిచ్చేందుకు ససేమిరా అంటుండగా, మరో ప్రధాన పార్టీ నేతలు భూ సమీకరణకు తాము సిద్ధమేనంటూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త వ్యాఖ్యలతో వెలిసిన ఫ్లెక్సీ గ్రామస్తుల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఫ్లెక్సీలో పులివెందుల, ఇడుపుపాయలకు రాజధాని తరలిస్తారంటూ.. మీ నేత 18 ఎకరాల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవచ్చా అంటూ ప్రత్యక్ష విమర్శలు గుప్పించారు. మా ఓట్లతో గెలిచిన శాసనసభ్యుడు మా ప్రాంత రాజధానిని అడ్డుకుంటా రా అంటూ మరో పార్టీ మనోభావాలను దెబ్బతీ సేలా చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి ఈ ఫ్లెక్లీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఎస్సై వినోద్‌ కుమార్‌ సిబ్బందితో ఆ ఫ్లెక్సీని తొలగించారు. అధికార పక్షం, ప్రతిపక్షం వారిని సమన్వయం చేసుకుంటూ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. భవిష్యత్‌లో ఇదే విధమైన ఘటనలు కొనసాగితే రాజధాని ప్రాంతం రణరంగంగా మారే అవకాశం ఉంటుందని గ్రామ పెద్దలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలున్న నివాసాల సమీపంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం పెనుప్రమాదం తప్పిందని వారు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో ఇటువంటి వివాదాలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని మహిళలు, స్థానికులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: