వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోగడ క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ డైరెక్ట్‌గానే చేస్తున్నారని ఎపిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని, చట్టపరంగా విచారణలూ జరిగే అవకాశం లేకపోలేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఇటీవల సింగపూర్, జపాన్‌కు బృందాలు ఎందుకు వెళ్ళాయో ఆరా తీస్తే అన్నీ బయటకు వస్తాయని ఆయన తెలిపారు.

రాజకీయ దందాలన్నీ త్వరలోనే బయట పడతాయని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు సాంకేతికంగా సాధ్యం కాదని తాను అనుభవంతో చెబుతున్నానని బొత్స తెలిపారు. పట్టిసీమ ద్వారా వరద నీటిని రాయలసీమకు తరలిస్తామని చెబుతున్న వారు దీని సాధ్యాసాధ్యాలు, సాంకేతికపరమైన అంశాలపై స్పష్టత ఇచ్చారా?, అసలు చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పడుతున్నందున పట్టి సీమ ద్వారా లిఫ్టులతో నీటిని తరలిస్తామని చెబుతున్నారని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

స్వార్థం కోసం ధనదాహంతోనే పట్టిసీమను తీసుకుని వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అలస్యం ఎందుకు అవుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే పట్టిసీమ లిఫ్టులను తొలగిస్తామంటున్నా, ఇది ఎప్పటికి సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆ లిఫ్టులను ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం జరుగుతోందనడానికి ఇంత కంటే మించిన నిదర్శనం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నదా? అని ఆయన అన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాజధాని నిర్మాణం, స్థల సేకరణ మినహా మరే ఇతర అంశాలనూ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

రాజధాని నిర్మాణానికి అవరోధాలు కల్పిస్తూ కొంత మంది రైతుల పంట పొలాలను దహనం చేస్తూ అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం అర్థరహితమని ఆయన విమర్శించారు. నీరు, విద్య, వైద్యం వంటి సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో స్వైన్‌ఫ్లూ ప్రబలుతున్నా, మరణాలూ జరుగుతున్నా పట్టించుకునే వారు లేరని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ప్రజల హక్కులకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స అన్నారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో తమ పార్టీ ప్రజల మద్దతును కూడగడుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: