రాజకీయ నాయకుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనం కోసం జనం మధ్య ఉండి పోరాడాలి. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దానిపై విస్తృతంగా అధ్యయనం చేసి ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ సమస్యపై తన వైఖరిని బలంగా వినిపించగలగాలి.. అంతే కాదు.. తన వైఖరే సరైందని ప్రజలను ఒప్పించగలగాలి. కుర్రప్రతిపక్షనేత జగన్ ఇందులో అనేక సార్లు విఫలమవుతున్నారు. పూర్తిస్థాయి రాజకీయనాయకుడుగా ఆయన పరిణితి చెందాల్సిన అవసరం కనిపిస్తోంది.

విభజన కారణంగా కొత్త రాజధాని అంశంలో జగన్ పార్టీ తన వైఖరిని జనంలోకి బలంగా తీసుకెళ్లలేకపోయింది. ఆ తర్వాత భూసమీకరణ అంశంలోనూ ప్రజల్లోకి వెళ్లి పోరాడటంలో వైసీపీ విఫలమైందనే చెప్పుకోవాలి. భూసమీకరణ అంశం విషయానికి వస్తే.. వాస్తవానికి భూములు అప్పగించడం చాలా మంది రైతులకు ఇష్టం లేదు. ఏటా రెండు పంటలు పండే ఖరీదైన భూములను సర్కారుకు అప్పగించి..వారిచ్చే పరిహారంతో సరిపుచ్చుకునేందుకు సిద్ధంగా లేరు.

కానీ వారికి తమ తరపున పోరాడే నాయకుడు కనిపించలేదు. ఆ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకున్నట్టు కనిపించదు. ప్రభుత్వం భూసమీకరణ ప్రకటించిన మొదట్లో అంతగా స్పందన కనిపించలేదు. మెట్ట ప్రాంతాల రైతులు తప్ప మిగిలినవారు భూములిచ్చేందుకు సుముఖంగా లేరు. మొదటి పదిరోజుల్లో కనీసం 5 వేల ఎకరాలు కూడా సమీకరణ పూర్తవలేదు. కానీ తమ తరపున బలంగా పోరాడే నాయకత్వం లేకపోవడంతో ఇక సర్కారుకు భూములివ్వక తప్పదన్న అభిప్రాయానికి క్రమంగా వచ్చారు.

రైతుల్లో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకూ 25 వేల ఎకరాలు సేకరించగలిగిందంటే అది చిన్న విషయం కాదు. అది ప్రభుత్వ విజయంగా కంటే ప్రతిపక్ష వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. రాజధాని రైతుల పోరాటానికి వైసీపీ సరైన వేదిక అందించలేకపోవడం వల్లే ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పడం సబబుగా ఉంటుందేమో. తీరా.. భూసమీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటించాలని నిర్ణయించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: