రాష్ట్రవిభజన తర్వాత.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఆంధ్రాలో కొత్త రాజధాని నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అటువైపు మరలిపోయారన్న వాదనలు వినిపించాయి. హైదరాబాద్ చుట్టపక్కల కూడా కొనుగోళ్లు అంతగా లేకపోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఒక్క పట్టణంలో మాత్రం కొన్ని రోజులుగా రియల్ భూమ్ జోరందుకుంది. అదే యాదగిరిగుట్ట. నృసింహాస్వామి కొలువై ఉన్న ఈ యాదగిరిగుట్ట ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశాకిరణంగా మారింది. యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ ప్రకటన చేసింది మొదలు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగింది.

కేవలం ఓ మాట అని ఊరుకోవడం కాకుండా.. యాదగిరిగుట్ట అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేకంగానే దృష్టిసారించారు. సీఎం అయిన తర్వాత తరచూ యాదగిరిగుట్టను సందర్శిస్తున్నారు. యాదగిగిరి గుట్ట అభివృద్ధి కోసం ఏకంగా పట్టణ అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుట్ట పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు. కేసీఆర్ దూకుడుతో గుట్ట ముఖస్వరూపం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుట్టలో పలు మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో.. ఆగమశాస్త్రాన్నిఅనుసరించి ఈ మార్పులు చేయిస్తానని కేసీఆర్ చెబుతున్నారు. ఏకంగా ఏటా వంద కోట్ల రూపాయలు గుట్టకు కేటాయించాలన్న కేసీఆర్ నిర్ణయం సరిగ్గా అమలైతే..గుట్టకు మహర్దశ పట్టినట్టే. దీనికితోడు యాదగిరిగుట్ట అభివృద్ధి రియలన్స్, టాటా వంటి సంస్థలు దాదాపు 300 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చాయని కేసీఆర్ వివరించారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా యాదగిరిగుట్ట సమీపంలో 200 గజాల ఫ్లాట్.. 50వేలకే అంటూ ప్రకటనలు ఊదరగొట్టేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: