మాటల మాంత్రికుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి ఇప్పుడు మాటలు కరువవుతున్నాయి. బడ్జెట్, ఆర్థిక సంఘం సిఫార్సులు, ప్రత్యేక హోదా వంటి విషయాల్లో ఆంధ్రాకు ఏమీ ప్రయోజనం కలగలేదన్న అభిప్రాయం జనంలోకి బాగా వెళ్లింది. గతంలో ఏపీకి తానే పెద్దదిక్కు అన్నట్లుగా మాట్లాడిన వెంకయ్య ఇప్పుడు ప్రెస్ మీట్లో నీళ్లు నమిలే పరిస్థితి కనిపిస్తోంది.ఆంధ్రాకు అన్యాయం ఏమీ జరిగిపోలేదని.. కేంద్రం విభజన చట్టంలోని హామీలు కచ్చితంగా అమలు చేస్తుందని ఆయన ప్రజలను విలేకర్లను నమ్మించలేకపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మోడీ సర్కారు ఏపీని మోసం చేసిందన్న అభిప్రాయంతో ఉన్ననేపథ్యంలో వెంకయ్య నాయుడి ప్రెస్ మీట్ హాట్ హాట్ గా సాగింది. కేంద్రం అన్యాయంపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో వెంకయ్య పలుసార్లు అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా.. నేను చెప్పేది ఇంతవరకే అని భీష్మించుకున్న వెంకయ్య.. ఒక దశలో మీడియా వైఖరిపై సెటైర్లు వేశారు. మీరు అడగదలుచుకున్నది అడిగారు. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. ఇంతకు మించి నా నుంచి మీరు ఏమీ రాబట్టలేరు. మీకు అర్థమయ్యేలా చెప్పి ఉండకపోతే.. అది మీ సమర్థత.. నా అసమర్థత అని అనుకోండి.. అంటూ విలేకరులపై రుసరుసలాడారు వెంకయ్య.

బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న వెంకయ్య ప్రతీ చిన్న అంశాన్నీ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కేంద్రం ఇచ్చిన దానికీ.. రాష్ట్రం అడిగిన దానికి వ్యత్యాసం ఉంటే.. ఆర్ధిక మంత్రి వద్ద చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు జరిగిన 100 కోట్ల కేటాయింపు న్యాయం కాదని.. అంగీకరించిన వెంకయ్య.. ఈ విషయమై ఆర్ధిక మంత్రిని మరోమారు సంప్రదిస్తామని వెల్లడించారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను కల్పిస్తూ చట్టం ఎందుకు చేయలేకపోయిందని వెంకయ్య ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: