రాజధాని ప్రాంతంలో రగడ ఇప్పుడే నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. భూ సమీకరణ విజయవంతమైందని ప్రభుత్వం ఆనందిస్తుండగా రాజధానిలో పర్యటించి భూ సమీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అను కూలంగా మలచుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తు న్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి పలుమార్లు పర్యటించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తాజాగా జగన్‌ ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో రాజధాని రగడ విషయం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి, భూసమీకరణ ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రాంత సమస్యలపై మీడియాతో మాట్లాడటం తప్ప ప్రతిపక్షనేత జగన్‌ రాజధాని ప్రాంతంలో నేరుగా పర్యటించలేదు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన కమీటీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి పార్ధసారధి మాత్రం ఒకటి రెండు పర్యాయాలు రాజధాని గ్రామాల్లో పర్యటించారు.

ఈ నెల 3వ తేదీన జగన్‌ రాజధానిలో పర్యటిస్తాడని చెబుతున్న నేపథ్యంలో మంత్రులు అగ్గిమీద గుగ్గిలమ వుతున్నారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ 30శాతం కూడా రైతులు అంగీకార పత్రాలు ఇవ్వలేదు. వీటిలో తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. ఇటీవల బేతపూడిలో భూసమీకరణకు వ్యతిరేకంగా జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉండవల్లి గ్రామంలో రైతుదీక్ష పేరుతో రైతులు దీక్ష చేశారు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో విపక్షాలు ఉన్నాయి. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, రాజధానికి ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగా భూములు ఇవ్వకపోతే భూసేకరణ చేస్తామని రైతులను ఆందోళనకు గురి చేయడం వల్లే రైతులు భయపడి చివరి రెండు రోజుల్లో 7వేల ఎకరాల వరకూ అంగీకార పత్రాలు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.

రాజధాని భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటుందని చెబుతున్నాయి. జనసేన నాయకులు పవన్‌ కళ్యాణ్‌ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న జనసేన నాయకులు పవన్‌ రాజధాని విషయంలో ఏ విధంగా స్పంది స్తాడనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ నాయకులు రాజధాని ప్రాంతంలో పర్యటించనుండటంతో రాజధాని ప్రాంతంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నందునే తుళ్ళూరు మండలాన్ని ఎంపిక చేయడానికి ఒక కారణమనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ మండలంలోని అన్ని గ్రామాల్లో దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగానే భూ సమీకరణ ప్రక్రియకు రైతులు మద్దతు పలికారు. గ్రామాల్లోని తెదేపా నాయకులు రైతులను సమీకరణకు ఒప్పించడంలో సఫలమయ్యారు. మంగళగిరి, తాడేపల్లి మండలాలపై వీరి ప్రభావం పెద్దగా కనిపించలేదు.

31,866 ఎకరాల భూ సమీకరణ రాజధానికి భూసమీకరణలో భాగంగా ఫిబ్రవరి 28 నాటికి 31,866 ఎకరాలను అధికారులు సమీకరించారు. మొత్తం 20,067 మంది రైతుల వద్ద నుంచి ఈ భూమి సమీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ భూ సమీకరణ జరగడంతో కొందరు రైతులను ఆదివారం ఉదయం అంగీకరపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఆదివారం కూడా కొన్ని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి భూ సమీకరణకు అనుకూలంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం భూ సమీకరణలో అంగీకార పత్రాలు ఇవ్వని భూములు కేవలం 1,000 నుంచి 2,000 ఎకరాల మధ్య ఉంటాయి. వీటిని భూ సేకరణ పద్ధతిలో తీసుకుంటారు. ప్రభుత్వం ప్రకటించిన హద్దుల్లోని భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తేనే అభివృద్ధి చేయడానికి ఆటంకాలు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: