భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం మీద గెలవలేమని రైతులు చెప్పినమాట ఆఖరికి నిజమైంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే రాజధాని నిర్మాణం అనివార్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ప్రకటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందనగా, ప్రజలంతా స్పష్టత కోరడంతో తుళ్లూరు ప్రాంతాన్ని రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు. అయతే బహుళ పంటలు పండే భూములను రాజధాని నిర్మాణాల పేరుతో నాశనం చేయవద్దంటూ రైతులు గళమెత్తగా, మరోవైపు రాజధాని ప్రకటనతో మెట్ట్భూముల ధర ఎకరా 10 లక్షల నుంచి కోట్లకు పరుగులెత్తింది.

దీంతో మెట్ట రైతుల్లో ఆశలు చిగురించగా, రాజధాని కావాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. కానీ బహుళ పంటలు పండే భూములను ప్రభుత్వం లాక్కోవద్దంటూ వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకించింది. అయన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సిఆర్‌డిఎ చట్టం తీసుకురాగా, వెనువెంటనే భూ సమీకరణ విధానాన్ని, రైతులకు ఇచ్చే ప్యాకేజీలను తెలియజేసింది. దీంతో రైతుల మనోభావాలు తెలుసుకునే పేరుతో వైసిపి డిసెంబర్ 20న తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో పర్యటించింది. రైతులు భూములు స్వచ్ఛంధంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదని, బలవంతంగా లాక్కుంటే అండగా ఉంటామని నేతలు చెప్పుకొచ్చారు. ఇతమిద్దంగా పార్టీ విధానంలో స్పష్టత లేకపోవడంతో అధికార ప్రభుత్వం ఇదే అదునుగా భావించి దూకుడుగా వ్యవహరించింది. భూ సమీకరణను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ముందుకెళ్లింది.

ఇదే సమయంలో కేంద్రంలోని మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావడం తెలుగుదేశానికి కలిసొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఆయుధంగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణను వేగవంతం చేసింది. దిగాలు చెందిన రైతులు ప్రభుత్వం వైపు గత్యంతరంలేని పరిస్థితుల్లో మొగ్గుచూపడం ప్రారంభించారు. అదే సమయంలో కృష్ణానది కరకట్ట ప్రాంతంలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు వెలుగుచూసింది. బిజెపి పోకడలను పూర్తిగా వ్యతిరేకించే వామపక్షాలు కారాలు మిరియాలు నూరాయి. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కరకట్ట ప్రాంతంలో స్వయంగా పర్యటించి బిజెపి, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర విమర్శలు చేశాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి కరకట్టపై గల అక్రమ కట్టడాలపై చర్యలకు పూనుకుంది. వామపక్ష నాయకుల పోరాట పటిమ వల్ల ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తించిన రైతులు కొంత ధైర్యాన్ని కూడగట్టుకోగా, వైసిపి నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిత్య పర్యటనలు, ఉద్యమాలతో రైతులకు కొంత భరోసా కల్పించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర నాయకులు లక్ష్మణరెడ్డి పర్యటనలు రైతులకు న్యాయపరంగా పోరాటం చేసేందుకు శక్తినిచ్చాయి. ఈ సమయంలోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కేసును స్వీకరించడంతో రైతుల్లో కొంత ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి అప్పటికే రాజధాని ప్రాంతంలో రెండుసార్లు పర్యటించారు. ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ సిపి ముచ్చటగా మూడోసారి రాజధాని గ్రామాల్లో 40 మంది ఎమ్మెల్యేలతో పర్యటించింది. తుళ్లూరులో రైతులు వ్యతిరేకించినప్పటికీ మిగిలిన గ్రామాల్లో సాదరంగా స్వాగతం పలికారు. దీంతో జరీబు రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వానికి అర్థమైంది. ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకుని అదనపు ప్యాకేజీ ప్రకటించారు.

భూ సమీకరణలో రైతులు పాల్గొనని పక్షంలో భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రులు ప్రకటనలు గుప్పించారు. పుష్కలంగా నీరు లభించే ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రభుత్వం ప్రకటిస్తుందనే భయం కూడా రైతుల్లో పొడచూపింది. వైఎస్‌ఆర్ సిపి అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో రైతులు కోరిన విధంగా సరైన సమయంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిని తీసుకురాలేక పోయారు. మొత్తానికి భూ సమీకరణ పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ పర్యటన మార్చి 3న అంటూ ప్రకటించడం పట్ల రైతుల్లో ఆశ్చర్యం ఏర్పడుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ పర్యటిస్తారనే వార్త కూడా గుప్పుమంటుం డటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: