'తెలుగోడి సత్తా చూపిస్తాం..' అని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ. అయితే ఈ పంచ్ వరకూ బాగానే ఉంది కానీ.. ఈయన ఎవరికి తెలుగోడి సత్తా చూపిస్తాడో మాత్రం అర్థం కావడం లేదు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన అంశం గురించి బాలకృష్ణ స్పందించాడు. అందరూ స్పందిస్తున్నారు తను కూడా స్పందించకపోతే బాగుండదని అనుకొన్నామో ఏమో కానీ బాలయ్య గర్జించాడు.

సహజశైలిలో డైలాగ్ చెప్పాడు. తెలుగోడి సత్తా చూపిస్తామని అన్నాడు. మరి ఈ సత్తా చూపించడం ఏమిటో అర్థం కావడంలేదు. బహుశా కేంద్ర ప్రభుత్వం పై పోరాట పంథాను ఎంచుకొంటామనే విషయాన్ని బాలయ్య ఇలా చెప్పాడనుకోవాలి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమే. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

తెలుగుదేశం ఎంపీలిద్దరు మోడీ క్యాబినెట్ లోఎంపీలుగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య ఇలా ప్రకటించడం ఆసక్తికరమైన అంశం. ఏదో కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ఇలా మాట్లాడినా అదో ముచ్చట. అయితే ఎన్నికల్లో తమతో కలిసి పోటి చేసిన బీజేపీ మీద బాలయ్య పోరాటం చేసే అవకాశం ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే!

బాబు అయితే కేంద్ర ప్రభుత్వంతో పోరాట పంథాను ఎంచుకొనే అవకాశమే లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మాత్రం కేంద్ర ప్రభుత్వానికి తెలుగోడి సత్తా చూపిస్తామని అంటున్నాడు. మరి బాలయ్య అదెలా చూపిస్తాడో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: