ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనేది అధికారికంగా చెప్పనంత వరకు నిధులెలా కేటాయిస్తామని రాష్ట్రాన్ని కేంద్రం ప్రశ్నించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించేందుకు బ్యాంకు ఖాతా ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు 2015-16లో బడ్జెట్‌లో పోలవరం, రాజధాని నిర్మాణం, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవటంపై తెలుగుదేశం ప్రభుత్వంతోపాటు ఎంపీలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గత రెండురోజుల నుంచి ఈ అంశంపై కేంద్ర మంత్రులు, తెలుగుదేశం ఎంపీలతో చర్చలు జరుపుతున్నారు.

చర్చలకు పోలవరం ప్రాజెక్టు ఇన్‌చార్జి అధికారి దినేష్‌కుమార్ సహా పలువురు ఇతర అధికారులను పిలిచారు. పోలవరానికి వెయ్యి కోట్లు, రాజధానికి వెయ్యికోట్ల కేటాయించేందుకు వెంకయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటితోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

కొత్త రాజధాని నిర్మాణంపై ఆంధ్ర సర్కారు నుంచి స్పష్టమైనే ప్రతిపాదన కేంద్రానికి ఇంతవరకు అందకపోవటం వల్లే నిధులు కేటాయింపు జరగలేదని కేంద్రం వాదిస్తోంది. ఆంధ్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై అధికారిక నివేదిక ఇవ్వగానే నిధులు కేటాయింపు ప్రారంభం అవుతుందని కేంద్రం చెబుతోంది. కొత్త రాజధాని స్థలం, ఇతర అంశాలను అధికారికంగా తెలియజేసేలోగా రింగురోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులకు వెయ్యి కోట్లు పట్టణాభివృద్ధి శాఖకు చెందిన వివిధ పథకాల నుంచి ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులకు గత ఏడాది కేటాయించిన 250 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రం ప్రశ్నించినట్టు చెబుతున్నారు. రూపాయి కూడా ఖర్చు చేయకుండా అదనపు నిధులు కోరటం అర్థరహితమని కేంద్ర ప్రభుత్వ అధికార్లు అంటున్నారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించగానే వివిధ పద్దుల కింద వెయ్యి కోట్లు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: