మంగళవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. పలుచోట్ల రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతోనూ మాట్లాడి.. వారు చెప్పింది.. విన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మొండిగా భూసమీకరణ చేస్తోందని విరుచుకుపడ్డారు.

రాజధాని ప్రాంతంలో అక్కడక్కడా జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. భూ బకాసురులా రైతులకు మేలు చేసేది గో బ్యాక్.. గో బ్యాక్ అని ఆ ఫ్లెక్సీలపై రాసి ఉంది. వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తన కంపెనీల కోసం వందల ఎకరాలు ప్రభుత్వం నుంచి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ , బెంగళూరుల్లోని జగన్ నివాసాలను కూడా ఈ ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. మీ నివాసానికి 18 ఎకరాల భూమి కావాలి.. 5 కోట్ల ప్రజల రాజధానికి ఎంత భూమి కావాలో తెలియదా.. అని ఆ ఫ్లెక్సీల్లో రాయడం విశేషం. జగన్ కు హైదరాబాద్ లోటస్ పాండ్ లో విశాలమైన భవనం ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 70 పడకగదులు ఉన్నాయని ప్రచారం ఉంది. అలాగే బెంగళూరులోనూ ఖరీదైన ప్రాంతంలో అత్యంత విశాలమైన కోట ఉంది.

ఈ ఫ్లెక్సీలను జగన్ పర్యటన దారిలో ఏర్పాటు చేశారు. అయితే వీటిని జగన్ అక్కడికి రాక ముందే వైసీపీ కార్యకర్తలు తీసేశారు. ఈ ఫ్లెక్సీలపై ఉన్న రాతలను చూస్తుంటే.. ఇది రైతుల పని కాదని.. టీడీపీ కార్యకర్తలే వీటిని ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: