మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒక తలనొప్పిని వదిలించుకొంది. కాశ్మీర్ సీఎం చేసిన వ్యాఖ్యానాలపై ప్రధానమంత్రి స్వయంగా వివరణ ఇచ్చుకొన్నాడు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం వెనుక ఘనత అంతా ఆ రాష్ట్ర ప్రజలదే కానీ.. ఉగ్రవాద సంస్థలది కాదని మోడీ స్పష్టం చేశాడు.

కాశ్మీర్ ముఖ్యమంత్రి సయీద్ వ్యాఖ్యానాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించమని మోడీ స్పష్టం చేశాడు. మొదటగా ఈ అంశం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన ప్రధానమంత్రి మోడీ తర్వాత మాత్రం వివరణ ఇచ్చాడు. ప్రతిపక్షాలు ఆందోళన తెలుపుతున్న తరుణంలో వివరణ ఇస్తే వారికి విలువనిచ్చినట్టు అవుతుంది. వేరే విషయాల గురించి అయితే వివరణ ఇవ్వకున్నా పర్వాలేదు.

అయితే ఇది కీలకమైన అంశం.. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అంశం. ఇప్పుడు గనుక వివరణ ఇవ్వకపోతే జాతిజనుల దృష్టిలో చెడ్డపేరు వస్తుంది.. అందుకే తప్పనిసరిగా మోడీ స్పందించాడు. కాశ్మీర్ ఎన్నికల విషయంలో సయీద్ చేసిన వ్యాఖ్యలుసరికాదని మోడీ వ్యాఖ్యానించాడు. వాటికి తమ మద్దతు లేదని స్పష్టం చేశాడు. తద్వారా తమ పార్టీపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు.

మరి ఇంతటితో అయిపోలేదు.. పీడీపీకి తీరుతో భారతీయ జనతా పార్టీకి మరిన్ని సమస్యలు తప్పవు. ఆ పార్టీకి పాకిస్తాన్ డెవలప్ మెంట్ పార్టీ అనే చెడ్డపేరు కూడా ఉంది. మరి దాంతో దోస్తీతో మోడీ అండ్ కో చాలా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందనడంతో సందేహం లేదు. ఒకసారి అడుగు ముందుకేశాకా తప్పదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: