పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో బాగానే డైలాగులు వల్లించాడు. అవి కూడా బాగా పేలాయి. జనసేనాని తొలి ప్రజాయాత్రకు జనం కూడా బాగానే తరలివచ్చారు. క్యాడర్ కాకుండా కేవలం లీడర్ మాత్రమే ఉన్న జనసేన కార్యక్రమానికి జనం ఆ స్థాయిలో వచ్చారంటే.. అది కేవలం పవన్ పట్ల అభిమానమే.. ఆయన ఆకర్షణ మంత్రమే.

జనం స్పందన చూసి పవన్ కల్యాణ్ కూడా రెచ్చిపోయారు. తాను ఇప్పటివరకూ రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నానని అనుకున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గురించి భయపడకుండా పవన్ రైతులతో కలసిపోయారు. వారిలో ఒకడినంటూ నమ్మకం కలిగించగలిగారు.

మీ భూములు ఎవరూ లాక్కోకుండా నేను పోరాడతా అని రాజధాని రైతులకు అభయం ఇచ్చాడు. అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానన్నాడు. అంతవరకూ ఓకే.. ఇన్నాళ్లూ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటూ వచ్చిన పవన్ ఒక్కసారిగా బాబు పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతవరకూ ఓకే.. మరి ఇదే తెగువ మోడిని విమర్శించేందుకు కూడా చూపుతారా.. ?

రాజధాని ప్రాంతంలో ఇప్పటికే తొలివిడత భూసేకరణ పూర్తయింది. 1500ఎకరాల భూమి మాత్రమే సమీకరించాల్సి ఉంది. ఈ భూమి సేకరణకు మోడీ సర్కారు తెచ్చిన కొత్త చట్టం బాగా అనుకూలంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అలాంటప్పడు.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించినంత సులువుగా.. డైలాగులు చెప్పినంత ఆవేశంగా.. ప్రధానిపై కూడా స్పందించగలరా.. ఢిల్లీ వెళ్లి ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయగలరా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: