పెళ్లికి ముందు తానిచ్చిన కట్నం డబ్బులు, నగలు ఇస్తే గాని మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రసక్తే లేదని భర్త మృత దేహానికే ఓ భార్య అడ్డుపడిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగింది. ఇందుకోసం తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలసి ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా, నడిరోడ్డుపై బైఠాయించింది. దీంతో అవాక్కయిన ప్రజలు, గ్రామపెద్దలు తమ సొంత పూచికత్తుతో ఆమెకు పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆ తరువాత పుట్టింటికి వెళ్లింది.

జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ సంఘట పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కలికిరి మండలం మరికుంటపల్లికి చెందిన గిరిప్రసాద్ (25) ముత్యాలవ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం చండ్రమాకులపల్లికి చెందిన శోభారాణికి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే ఈ వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడంతో అత్తగారింటికి రాకుండా అమ్మగారింటిలోనే ఉండిపోయిన భార్యను తన వద్దకు రప్పించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. పెద్దలతో పంచాయతీలు నడిపాడు, పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. అయినప్పటికీ శోభరాణి తనభర్త వెంట రావడానికి అంగీకరించలేదు. దీంతో ఏంచేయాలో అర్థంకాని గిరిప్రసాద్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈవిషయం గుర్తించిన కుటుంబ సభ్యులు శోభారాణికి సమాచారం అందించి భర్తను చివరి చూపు చూసుకోవాలని తెలిపారు.

అయితే శోభారాణి ఉదయం 10గంటల ప్రాంతంలో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి నేరుగా కలికిరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగింది. చనిపోయిన భర్తను కడచూపు చూసుకోవడానికి వస్తుందనుకుంటే రోడ్డుపై బైఠాయించి ఎందుకు రాస్తారోకో చేస్తోందో అర్థంకాక అక్కడకు చేరుకున్న గ్రామస్థులకు, పోలీసులకు శోభారాణి మాటలు షాకిచ్చాయి. తాను భర్తను కడసారి చూసుకోవడానికి రాలేదని, పెళ్ళికి ముందు తానిచ్చిన 70 గ్రాముల బంగారునగలు, 20వేల నగదు ఇవ్వాలని, అంత వరకు గిరిప్రసాద్ మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తే ఒప్పుకోనని, అంత వరకు రోడ్డుపై నుంచి లేచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

దాదాపు గంట సేపు ఎందరు చెప్పినా ఆమె వినకపోవడం, భర్త మృతదేహాన్ని కూడా చూడటానికి కదలకపోవడంతో గ్రామ సర్పంచ్ ఆనంద్‌రెడ్డి తానే 30 గ్రాములు బంగారునగలు, 10వేలు ఇస్తానని చెప్పడంతో శోభారాణి ఆందోళన విరమించింది. ఆ తరువాతే మరికుంటపల్లికి వస్తుందనుకుంటే రాకుండానే తన ఊరికి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో కలికిరి మండల ప్రజలు ముక్కునవేలుసుకున్నారు. చివరకు గిరిప్రసాద్ మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: