అయిపోయింది ఒక సెమీఫైనల్. అద్భుతంగా పోరాడిన రెండు జట్లలో చివరికి న్యూజిలాండే గెలిచి.. ఫైనల్లో అడుగుపెట్టింది. అంత క్లోజ్ మ్యాచ్‌లో ఓడటం ఎవరికైనా బాధ కలిగించేదే. దక్షిణాఫ్రికా చరిత్ర ఏంటో తెలుసు కాబట్టి బాధ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మరి రెండో సెమీఫైనల్ మాటేంటి? ఈ మ్యాచ్ ఎలా సాగబోతోంది? ఎవరిది పైచేయి అవుతుంది? మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగేది ఎవరు? చూద్దాం పదండి.


నెల కిందట ఆస్ట్రేలియాకు, భారత్‌కు మ్యాచ్ అంటే.. ఎవరైనా ఆస్ట్రేలియానే హాట్ ఫేవరెట్ అని చెప్పేవాళ్లు. టెస్టు సిరీస్‌లో, ముక్కోణపు వన్డే సిరీస్‌లో ధోనీసేనను కంగారూలు ఎలా చిత్తు చేశారో అందరూ చూశాం. ఐతే నాటి టీమ్‌ఇండియా వేరు, ఇప్పటి టీమ్ ఇండియా వేరు. ఆటగాళ్లలో మార్పులేదు కానీ.. వారి ఆటతీరులో, వారి ఆత్మవిశ్వాసంలోనే ఇప్పడు మార్పంతా.


ఫామ్, కాన్ఫిడెన్స్.. ఈ రెండు ఆయుధాలతోనే గురువారం బరిలోకి దిగబోతోంది భారత్. బ్యాటింగ్‌లో ధావన్ దగ్గర్నుంచి ధోని వరకు అందరూ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో పేసర్లు షమి, ఉమేశ్, మోహిత్.. స్పిన్నర్లు అశ్విన్, జడేజా.. సత్తా చాటుతున్నారు. ఏడు వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్.. ఇప్పటిదాకా ఆడినట్లే ఆడితే ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద కష్టం కాదు.


పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుందని వార్తలొస్తున్నాయి. పైగా స్టేడియంలో భారత అభిమానులే ఎక్కువమంది ఉంటారన్న అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి సొంత గడ్డ మీద ఆడుతున్న ఫీలింగే ఉంటుంది ధోనీసేనకు. ఐతే ఎన్ని సానుకూలతలున్నా.. ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడమంటే చిన్న విషయం కాదు. ప్రపంచ అత్యుత్తమ జట్లలో వాళ్లది ఒకటి. వార్నర్, ఫించ్, వాట్సన్, క్లార్క్, స్మిత్, మాక్స్‌వెల్.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ వాళ్లది. ఇక బౌలింగ్‌లో స్టార్క్, జాన్సన్, హేజిల్‌వుడ్, ఫాల్క్‌నర్ లాంటి బౌలర్లున్నారు. కాబట్టి ధోనీసేన దేనికైనా రెడీ అన్నట్లుండాలి. అప్పుడే కంగారూల్ని దెబ్బ తీసి ఫైనల్ చేరగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: