సాధారణంగా భారత ప్రజాస్వామ్యంలో విదేశాంగ వ్యవహారాలు అనేవి కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి. మన సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అధికార పరిధుల ప్రకారం విదేశాంగశాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఒక మంత్రి దానికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను గమనిస్తే మాత్రం ఈ రాష్ట్రానికి ఒక విదేశాంగ శాఖ అవసరమేమో అనిపిస్తోంది! ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీకి విదేశాలతో సంబంధాలు ఏర్పడుతున్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో బాబు వివిధ దేశాల వారితో సంప్రదింపులు జరపడానికి ఆయాదేశాల్లో పర్యటించి వచ్చారు.


ఇక ఏపీ రాజధాని నిర్మాణంఅనేపనిని పూర్తిగా సింగపూర్ ప్రణాళికతోనే చేపట్టనున్నారు. ఇక  జపాన్ వాళ్లు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారని బాబు అండ్ బ్యాచ్ చెబుతోంది. జపాన్ కోసం ఏపీలో ప్రత్యేకంగా ఒక నగరాన్నే ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. స్కూళ్లలో విద్యార్థులు జపనీ భాషను నేర్చుకోవాలని కూడా బాబుగారు ఇప్పటికే సూచించేశారు! ఇలాంటి పరిణామాల నేపథ్యంలో స్వతంత్ర సింగపూర్ ప్రథమ ప్రధాని చనిపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నివాళిఘటించింది. సాధారణంగా ఏ రాజ్యసభలోనో.. లోక్ సభలోనో విదేశీ నేతలకు నివాళిని ఘటించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే విచిత్రంగా  సింగపూర్ మాజీ ప్రధాని లీక్వాన్ మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి ఘటించింది. అదే విచిత్రం అనుకొంటే.. లీక్వాన్ అంత్యక్రియల కోసం చంద్రబాబు సింగపూర్ లో కూడా వెళ్లారు!
సాధారణంగా భారత దేశంలో బాగా అనుబంధం ఉన్న విదేశీ నేతలెవరైనా చనిపోతే భారత ప్రభుత్వం అధికారికంగా వారి అంత్యక్రియలకు అధికారులను పంపిస్తుంది. అయితే ఇలాంటి సంప్రదాయాలకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ దేశా మాజీ అధినేత అంత్యక్రియల కోసం ఆ దేశం వెళ్లారు.

మరి ఇవన్నీ మొదలు మాత్రమే! సింగపూర్ వాళ్లు ఏపీ రాజధాని నిర్మాణ పనులను సమీక్షించినా.. జపాన్ వాళ్లు ఏపీలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొనే పనులు ప్రారంభించినా.. ఆయా దేశాల వ్యవహారాలను సమీక్షించడానికి ఇలా మంచీ చెడులో కలిసిపోవడానికి ఒక మంత్రిత్వ శాఖ అయితే అవసరం. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో విదేశాంగ శాఖను సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ శాఖకు ఆయనకు బాగా గురి కుదిరిన వ్యక్తి చేతిలో పెట్టో లేక తనే ఆ శాఖ బాధ్యతలను సమీక్షిస్తూ సాగి పోవాల్సి ఉంటుంది. బాబు గారికి కూడా ఈ పాటికే విదేశాంగ శాఖ ఆలోచన వచ్చి ఉండాలి కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: