గుర్తుందా 2003 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో? తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఆ తర్వాత వరుసగా అన్ని మ్యాచ్‌లూ గెలుచుకుంటూ ఫైనల్లోకి దూసుకెళ్లింది గంగూలీ సారథ్యంలోని భారత జట్టు. కానీ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఏకంగా 359 పరుగుల భారీ స్కోరు సాధించి భారత్‌కు సవాలు విసిరింది.


ఒక ఇన్నింగ్స్ ముగిసేసరికే భారత్ ఓటమి ఖరారైపోయింది. ఆ తర్వాత భారత్ అద్భుతాలేమీ చేయలేదు. 234 పరుగులకే ఆలౌటై.. పరాజయం చవిచూసింది కంగారూలకు ప్రపంచకప్ అప్పగించేసింది. ఇక ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ జరుగుతున్న తీరు చూస్తే మళ్లీ మనకు 2003 అనుభవమే ఎదురవుతుందేమో అన్న కంగారు కలుగుతోంది.


ఈసారి టాస్ వాళ్లది. మొదట బ్యాటింగే చేశారు. ఆరంభంలోనే వార్నర్ (12) వికెట్ కోల్పోయినా కంగారు పడకుండా స్మిత్ (105), ఫించ్ రెండో వికెట్‌‌కు 182 పరుగులు జోడించారు. 37 ఓవర్లకు 231/2తో పటిష్ట స్థిలో ఉంది ఆస్ట్రేలియా. పరిస్థతి చూస్తుంటే కంగారూ జట్టు అలవోకగా 350 పరుగులు చేసేలా కనిపిస్తోంది. కాబట్టి 2003లో లాగే భారత్ ముందు భారీ లక్ష్యం నిలవడం ఖాయమనే అనుకోవాలి.


టోర్నీలో వరుసగా 7 విజయాలతో జోరుమీదున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే అసాధారణంగా ఆడక తప్పదు. ఈ రోజుల్లో 350 లక్ష్యమైనా విజయం అసాధ్యమేమీ కాదు. ఐతే ఓపెనర్లు శుభారంభం ఇవ్వకుంటే మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోలేం. బ్యాట్స్‌మెన్ అంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: