తెలంగాణపై ఏదో ఒకటి తేలుతుందన్న ప్రచారంతో.. రాష్ట్ర రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు తెలంగాణపై దూకుడు పెంచుతున్నాయి. ఓ అడుగు ముందుకేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణకు టీడీపీ వ్యతిరేమంటున్న వారిపై ఎదురుదాడికి దిగుతోంది. చంద్రబాబును విమర్శించే నైతికత టీఆర్ఎస్ పార్టీకి లేదని తెలుగుదేశం నేతలు ఎదురు దాడి మొదలు పెట్టారు. అవసరాల కోసం రాజకీయాలు చేస్తూ.. అమ్ముడు పోతున్న నేతలు తెలంగాణపై మాట్లాడతారా అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే.. హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ లో చేరేవాడని, రాజకీయ ఓనమాలు కూడా తెలియని కేటిఆర్ చేసే విమర్శలను తాము పట్టించుకోమని అంటున్నారు. రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ కు టీడీపీ నేతలు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు విషయమై టీడీపీ రాసిన లేఖ గురించి తనకు తెలియదనడం కేంద్ర హోం మంత్రి షిండే అవివేకమని యనమల రామకృష్ణుడు అన్నారు. సెప్టెంబర్ లోనే తెలంగాణపై స్పష్టమైన వైఖరితో తెలుగుదేశం ప్రధానికి లేఖ రాసిందని చెప్పారు. లేఖ అందినట్లు ప్రధాని సంతకంతో తమకు మరో లేఖ అందిందని చెప్పారు.  ప్రధాని వేరు, కేంద్రప్రభుత్వం వేరు అన్నట్లు షిండే మాట్లాడటం ఆయనకున్న అవగాహనా రాహిత్యాన్ని తెలయజేస్తోందన్నారు యనమల. తెలుగుదేశం పార్టీ దూకుడు వెనక వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రత్యేకించి కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు చేయడం లేదని భావిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు. అందుకే ఇప్పుడున్న ఊపును ఏమాత్రం తగ్గించకూడదని అనుకుంటున్నారు. ఢీ అంటే ఢీ కొట్టేందుకు సిద్ధమౌతున్నారు. మును ముందు కూడా తెలుగుదేశం నేతలు ఇదే స్పీడ్ కొనసాగిస్తే.. తెలంగాణ రాజకీయం మరింతా వేడిపెరగడం ఖాయమనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: