విశాఖ జిల్లాలో ఘోరం జరిగింది. ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు సజీవ దహనమై కనిపించారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండాగా దారిలోనే కన్నుమూశాడు.  

తీవ్రంగా గాయపడినవారిన విశాఖకు తరలించారు. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరగవచ్చని చెబుతున్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లోని ఓ షెడ్‌లో ఈ బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బాణాసంచా కేంద్రంలో 15 మంది వరకూ పనిచేస్తున్నారు. 

భారీ పేలుడు ధాటికి మృతుల మృతదేహాలు 100 మీటర్ల వరకూ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల పరిహారం అందించాని కలెక్టర్ ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

పేలుడు విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగినా.. అక్రమంగా బాణా సంచా తయారు చేస్తున్న కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే నేతలు, అధికారులు ఆ తర్వాత పట్టించుకుంటే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవు.


మరింత సమాచారం తెలుసుకోండి: