కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గారు ఇటీవల హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ''నష్టదాయకమైన వ్యవసాయంలో రైతులు ఎల్లకాలం ఉండాలా? వారి పిల్లలు మట్టిపిసుక్కొనే బతకాలా?'' అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మట్టిపిసుక్కొనే రైతుల్ని ఆ స్థితినుంచి ఏసి గదుల్లో కాలుమీద కాలువేసుకొనే స్థితికి తీసుకువెళతానని ఆర్భాటంగా ప్రకటించారు. నిజానికి ఏ రైతుబిడ్డా తాను చేసే వృత్తిని తక్కువగా చూసుకోడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చినప్పుడు చూసుకొని ఎంతో మురిసి పోతాడు. కానీ ఇపుడు మన పాలకులు ఆ వ్యవసాయాన్ని మటూమాయం చేసి, రోజూవారు ప్రకటనలు చేస్తున్నట్లు నిజంగానే...ఈ ప్రపంచంలోనే పొలాలేలేని దేశమైన సింగపూర్‌లా తయారు చేయాలని కంకణం కట్టుకొన్నట్లున్నారు.

కష్టాల్లో రైతులు

HY06COTTON_FARMERS_1134823f.jpg (636×424)

వ్యవసాయరంగం మనదేశ ఆర్థికాభివృద్ధికి పునాది అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మన దేశంలో ఇప్పటికీ వ్యవసాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి తమ జీవనాధారాన్ని గడుపుతున్న ప్రజలు దాదాపు 70శాతం మంది ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాని 1991 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు ఈ రంగంలో మార్కెట్‌ శక్తుల ఆధిపత్యాన్ని పెంచి రైతన్నలను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసివేశాయి. ఫలితంగా ఈ రంగంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. మార్కెట్లలో రైతుల దోపిడీ యథేచ్చగా కొనసాగుతోంది. నాసిరకం విత్తనాలు, నకిలీ ఎరువులు, హద్దూ, అదుపు లేకుండా పెరిగిపోతున్న వ్యవసాయ ఉపకరణాల ధరలు, కొరవడుతున్న సంస్థాగత పరపతి సౌకర్యాలు, ప్రభుత్వ విధి విధానాలలో లోపాలు, లొసుగులు, నానాటికి తరుగుతున్న ప్రభుత్వ పెట్టుబడులు కలగలిసి రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జాతీయ నమూనా శాంపిల్‌ సర్వే ఇటీవల వెల్లడించిన రైతుల అభిప్రాయ సేకరణ విశ్లేషణ ప్రకారం- ప్రత్యామ్నాయ ఆదాయ వృత్తులు చేరువలో ఉన్నట్లయితే భారీ సంఖ్యలో రైతులు వ్యవసాయాన్ని వదిలి వేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడైంది.

మనదేశంలో అనేక చట్టాలు అమలవుతున్నా, వాటి ద్వారా నష్టపోయిన బాధిత రైతులు న్యాయాన్ని పొందడం లేదనేది యథార్థం. రైతుల సాధికారతను సాకారం చేసే అంశాలు చాలా చట్టాలలో ప్రస్ఫుటంగా చొప్పించి నప్పటికీ, రైతులకు న్యాయం ఎండమావిగానే మిగిలి పోయింది. దీనికి ప్రబల తార్కాణం 'వినియోగ దారుల పరిరక్షణ చట్టం -1986' అని గట్టిగా చెప్పవచ్చు. రైతన్నల హక్కులను ప్రయోజనాలను పరిపుష్ఠి చేసి, వాటిని కాపాడటానికి ఈ చట్టంలో చాలా లబ్ధిదాయక మైన నిబంధనలు అనేకం ఉన్నప్పటికీ రైతుల్లో నెలకొన్న అజ్ఞానం. అవగాహనా రాహిత్యం వల్ల వారు ఆశించిన విధంగా లబ్ధిపొందడం లేదు. ఈ చట్టాన్ని రైతన్నలకు చేరువలోకి తీసుకురావడంలో ప్రభుత్వ విభాగాల నిర్లిప్త, ఉదాసీన వైఖరికూడా క్షేత్రస్థాయిలో నెలకొన్న అచేతనా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది.

నష్టపోయిన బాధిత రైతులు

farm-power_1054337f.jpg (636×445)

గణనీయ సంఖ్యలో రైతన్నలు విత్తనాలు లేదా ఇతర వ్యవసాయ ఉపకరణాల కొనుగోలు విషయంలో నష్టపోయినపుడు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత రైతన్నల ప్రయోజనాలను, హక్కులను సంరక్షించడానికి వినియోగదారుల ఫోరాలలో కేసులను దాఖలు చేసే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. అయినా ఈ నాటికీ అటువంటి కేసుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటి కూడా దాఖలు చేయలేదనేది వాస్తవం. దేశ వ్యాప్తంగా వినియోగదారుల ఫోరాలలో రైతు సమస్యలు మీద దాఖలవుతున్న కేసులు మృగ్యమన్న విషయం కూడా రైతన్నలలో ఈ చట్టం మీద అవగాహన శూన్యమని తేటతెల్లం చేస్తోంది. వివిధ వ్యవసాయ ఉపకరణాలకు, సేవలకు ప్రతిఫలం చెల్లించి వాటిని వినియోగించుకుంటున్న రైతులు- ఈ చట్టం ప్రకారం వినియోగదారుల పరిధిలోకి వస్తారు. వస్తు సేవలు కొనుగోలులో నష్టపోయిన రైతులు వినియోగదారుల ఫోరంలో స్వయంగా కానీ లేదా ప్రజాహితం కాక్షించే వినియోగదారుల సంఘాల సహకారంతో కానీ కేసులు దాఖలు చేసి న్యాయాన్ని పొందవచ్చు. రైతులు కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవల బిల్లులు, గ్యారంటీ కార్డులు, ఇతర ఆధారాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. 


FARMER_2_27320f.jpg (636×509)

రైతన్నలు మార్కెట్లలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను 'వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-1986పై తమ అవగాహనను, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా అధిగమించవచ్చు. రైతు వాణిజ్య విపణిలో నష్టపోయినపుడు లేదా దోపిడీ గురయినపుడు నిశబ్దంగా తనకు తాను కుమిలిపోకుండా ధైర్యంతో తన హక్కులను పరిరక్షించుకోడానికి నడుంబిగించాలి. తద్వారా తన తోటి సహోదర రైతులకు మార్గదర్శకం కావాలి. ఫోరంలో కేసు దాఖలు చేసేముందు జాగ్రత్తలు :కొనుగోలు చేసిన విత్తనాలు ఇతర వ్యవసాయ ఉపకరణాలకు సంబంధించిన బిల్లును తప్పనిసరిగా పొంది భద్రపరచుకోవాలి. బిల్లును తప్పనిసరిగా కీలకమైన అధారపత్రంగా ఫోరంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు పొందినప్పుడు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పదిలంగా ఉంచుకోవాలి. విత్తనాలు నాసిరకం, నాణ్యాతాలేమి మూలంగా పంట దెబ్బతిన్నప్పుడు తప్పనిసరిగా వ్యవసాయ విసృత్త అధికారి నుంచి సంబంధిత విషయాన్ని ధృవీకరిస్తూ జారీ చేసే ప్రతాన్ని పత్రాన్ని పొందాలి. పంటల బీమా సౌకర్యాన్ని లభ్యం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు పదిలంగా ఉంచుకోవాలి.

పండించిన పంటను అమ్మేటప్పుడు కాటాలను నిశితంగా పరిశీలించి మోసపోకుండా చూసుకోవాలి. పంటను శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన రసీదులు సజావుగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. పంటను అమ్మేటప్పుుడు తూనికలు కొలతల్లో ఉండే మోసాల విషయాలు అప్రమత్తంగా వ్యవహరించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: