రాష్ట్రంలో నెలకొన్న కరువు వల్ల తాగు, సాగు నీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుకు భరోసా ఇచ్చే వారు కరువయ్యారు. ఆపన్న హస్తం అందించే వారికోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఆపదలో ఉన్నాం ఆదుకొమ్మని తన మనస్సులోనే వేడుకొంటున్నాడు. వ్యవసాయంలో తన రెక్కల కష్టానికి దీటుగా నడిసొచ్చే ఎద్దులను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నాడు. పాడి పశువులను సైతం అంగడికి తరలించేందుకు వెనుకాడటం లేదు. కొద్దోగొప్పో పాలిచ్చే బర్రెలను కూడా అమ్ముకోవాలని చూస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం గొడ్లకు మేత లేకపోవడమే. పశువుల దాణాకు గతంలో ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇచ్చేది. కానీ ఇప్పుడు సబ్సిడీ లేదు, పశువుల సంక్షేమమూ లేకుండా పోయింది. వ్యవసాయం చేసే ఎడ్లు ఒక జత దాదాపు లక్ష రూపాయల విలువ చేస్తాయి. ప్రస్తుతం ఆ ఎడ్లను 'అడ్డికి పావుసేరు' అన్నట్లు రూ. 50వేలకే అమ్ముకుంటున్నారు. వరంగల్‌ జిల్లా నవాబ్‌పేట, కురివి, సదాశివపేట, సిద్దిపేట, చేర్యాల,హుస్నాబాద్‌, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌, మోత్కూర్‌, రామన్నపేట, నార్కట్‌పల్లి వంటి ప్రధాన సంతల్లో పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో నలుగురు ఆడబిడ్డలున్నవారి పరిస్థితి, నాలుగు పశువులున్నవారి స్థితి ఒకే విధంగా ఉన్నదని రైతులు వాపోతున్నారు. వర్షాలు లేకపోవడంతో అడవిలో సంచరించే మూగ జీవాలు కూడా రాత్రిపూట పల్లెల్లోకి ప్రవేశిస్తున్నాయి. అడవి పందులు, నక్కలు,దుప్పిలు, ఎలుగుబంట్లు వంటివి ఇళ్లల్లో ఉండే నీటి గోలాల(జాలారి) వద్దకొచ్చి దాహం తీర్చుకొని పోతున్నాయంటే కరువు ఏ విధంగా ఉన్నదో ఊహించుకోవచ్చు.

రైతుల వ్యధ 

గతంలో గ్రామ శివారు ప్రాంతంలో మూగజీవాల కోసం నీటి తొట్ల నిర్మాణం చేపట్టారు. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి నేలమట్టం అయ్యాయి. మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. పంట పొలాలపై ప్రకృతి విలయతాండవం చేస్తోంది. పల్లెల్లో పచ్చగా కనిపించాల్సిన పంట పొలాల్లో దుమ్ముకొట్లాడుతోంది. పంటలు ఎండిపోయి పొలాలు బీడుబారిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి,. పెరిగన ఎరువుల ధరలు, విత్తనాలతో అతికష్టంమీద సాగు చేసిన రైతులకు ఎండిన పొలాలను చూస్తుంటే గెండెలు తరుక్కుపోతున్నాయి. రైతులు సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అని తల పట్టుకుంటున్నారు. పట్టణాల్లో 500నుంచి 1000ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు. పల్లెల్లో 250 నుంచి 350ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు. అయినా చుక్క నీరు రావడం లేదు. ప్రస్తుతం నెలకొన్న కరువుకు రైతుల కష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించకుండా ప్రకృతిపై నెడుతోంది. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు ప్రభుత్వానిదే బాధ్యతని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా జలాలను జూరాల, శ్రీశైలం నుంచి తరలించి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లోని చెరువులు, కుంటలను నీళ్లతో నింపడం సాధ్యమవుతుంది. ఐతే, ప్రభుత్వానికి సరైన జలవిధానం లేకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. నీటి లభ్యత ఉండి కూడా ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేకపోతోంది.

ఉదాహరణకు ప్రతిఏటా 400 టిఎంసీల నీళ్లు గోదావరి పాలవుతున్నాయి. నీళ్లను మళ్లించలేకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వేసవి కాలంలో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్పప్పటికీ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణంలోని చెరువులో ఎంతో కొంత నీరుండేది. ఈ ఏడాది ఆ చెరువు ఎండిపోయి దర్శనమిస్తుంది. వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిసి ఆ చెరువు నిండినట్లయితే సుమారు 1500 ఎకరాల ఆయకట్టు వరి సాగయ్యే అవకాశం ఉంది. నీళ్లు లేకపోవడంతో ఆ చెరువు కట్టకింద పొలాలు పడవుపడ్డాయి. మెదక్‌ జిల్లాలో రెండు లక్షల మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. ఎకరానికి రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడికి కనీసం సగమైనా వచ్చే పరిస్థితి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: