కేంద్రం ఆంధ్రాకు మొండి చేయ చూపుతోంది... బాబు ఢిల్లీ యాత్రలు చేయడమే తప్ప.. విమాన ఛార్జీల మందం కూడా కేంద్రం సాయం చేయట్లేదు.. ఇదిగో .. అదిగో అని సుజనా మాటల కోతలే తప్ప రూపాయి నిధులు రాలడం లేదు.. ఇదీ నిన్నటి వరకూ బాబు సర్కారుపై ఉన్న విమర్శలు.. 

మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించాడు. పదే పదే తిరిగిన ఫలితం.. సుజనా, వెంకయ్య వంటి నేతల ఒత్తిడి ఫలించింది. కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. రాజధాని నిర్మాణం కోసం రూ.1500 కోట్ల రూపాయల సాయం అందజేయనున్నట్టు ప్రకటించింది. 

విభజన చట్టంలోని 94 (3) సెక్షన్ కింద ఈ నిధులు కేటాయించినట్టు  కేంద్రం తెలిపింది. రాజ్ భవన్ , సచివాలయం, శాసనసభ, హైకోర్టుల నిర్మాణం కోసం 500 కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 

ఇది ప్రత్యేక ఆర్థిక సాయంగా కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. ఐతే రాజధాని నిర్మాణానికి ఈ సాయం సరిపోతుందా అని పెదవి విరిచేవారూ లేకపోలేదు. కానీ మొన్నటి పోలవరం నిధుల కేటాయింపులతో పోలిస్తే రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు అందించినట్టే భావించాలి. కేసీఆర్ కొత్త సచివాలయం కోసం 150 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆ లెక్కన చూసుకున్నా.. కేంద్రం నిధులతో ప్రధాన భవనాలన్నీ పూర్తవుతాయని ఆశించొచ్చు. ఎంతైనా గుడ్డి కన్నా మెల్ల మేలు కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: