నిన్న మొన్నటి వరకూ ఏపీపై శీతకన్ను వేసిన కేంద్రం ప్రస్తుతం కాస్త జాలి చూపుతోంది. ఏకంగా సీఎం చంద్రబాబే కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించిన ఫలితమో.. ఢిల్లీ లాబీయింగ్ ఫలితమో తెలియదు కానీ ఏపీకి ప్రస్తుతం కేంద్రం నుంచి మంచి సాయమే అందుతోంది. రాజధాని కోసం 1500 కోట్లు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు మరికొన్ని నిధులు పంచుతోంది. 

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కేంద్రం నుంచి ఏపీ ఖాతాకు దాదాపు 2300 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో మొత్తం విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4300 కోట్ల రూపాయల సాయం అందినట్టైంది. కష్టకాలంలో ఏపీకి ఇది చెప్పుకోతగిన సాయమే.

ఆ మధ్య ఢిల్లీలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి త్వరలో ఏపీకి కేంద్రం నుంచి 10 వేల కోట్లు వస్తాయని చెప్పారు. అప్పుడు ఆయన మాటలు ఎవరూ అంతగా నమ్మలేదు.. ఆ తర్వాత కూడా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో.. ఏపీకి మొండిచెయ్యే అని అంతా అనుకున్నారు. 

కానీ చివరి నిమిషంలో కేంద్రం నుంచి ఏపీకి నిధుల వరద పారింది. రెవెన్యూలోటు భర్తీ 2300కోట్లు, రాజధాని కోసం 1500 కోట్లు, 13వ ఆర్థిక సంఘం నిధులు 2300కోట్లు, గతంలో వెనుకబడి జిల్లాల ప్యాకేజీరూపంలో వచ్చిన 350 కోట్లు.. ఇలా అన్నీ కలిపి లెక్కేసుకుంటే ఇప్పటివరకూ ఏపీకి కేంద్రం నుంచి 8 వేల కోట్ల పైచిలుకు సాయం అందింది. దీంతో సుజానా చౌదరి ఊపిరిపీల్చుకున్నారు. మాట నిలబెట్టుకున్నానని సంతోషపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: