ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంక్షోభంలో చిక్కుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలో తిరుగుబాట్లతో ఇప్పటికే సతమతమవుతున్న ఆయనపై ఆప్ మాజీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతల పేరుతో తప్పుడు ఫోన్‌కాల్స్ చేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులకు కేజ్రీవాల్ అనుమతిచ్చారని ఆప్ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే రాజేశ్‌గార్గ్ మంగళవారం ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని తెలిపారు.


కేజ్రీవాల్ అనుమతితో ఆప్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిన వ్యక్తులు బీజేపీకి మద్దతిస్తే రూ.10 కోట్ల చొప్పున ముట్టజెపుతామని ఆశచూపారని చెప్పారు. గార్గ్ ఆరోపణలతో కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శల దాడి పెంచింది. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత శ్రీకాంత్‌శర్మ డిమాండ్ చేశారు. కాగా, ఆప్ తిరుగుబాటు నేతలు ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్‌ను బెదిరించి పార్టీ నేషనల్ కౌన్సిల్ నుంచి తప్పించారని శివసేన అధికారిక పత్రిక సామ్నా ఆరోపించింది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే పార్టీ నేషనల్ కౌన్సిల్ నుంచి తొలగించిన తిరుగుబాటు నేత యోగేంద్రయాదవ్‌ను ఆప్ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా తొలగిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులిచ్చింది


మరింత సమాచారం తెలుసుకోండి: