చరిత్రలో కొత్త నగరాల నిర్మాణం అరుదుగా జరుగుతుంటుంది. ఉన్న నగరాల విస్తరణ సాధారణమే కానీ.. పూర్తిగా కొత్త నగరాన్ని అందులోనూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిలవాలన్న లక్ష్యంతో నిర్మించడం ఆసక్తిదాయకమే. అలాంటి అవకాశం విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు లభించింది. 

అలాగే.. చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న రాజధానికి పేరు పెట్టడం కూడా అరుదైన అవకాశమే. చరిత్ర ఉన్నంతవరకూ చెప్పుకునే ఆ పేరును సూచించే అవకాశం రావడం నిజంగా చారిత్రక అవకాశమే. ఆంధ్రా మీడియా మొఘల్ గా చెప్పుకునే రామోజీ రావు అలాంటి గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. 

ఆంధ్రా కొత్త రాజధానికి రకరకాల పేర్లు పెడతారని ఇన్నాళ్లూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నగర్ అని.. తారకరామనగర్ అని.. కొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో.. అమరావతే కొత్త రాజధానికి సరైన పేరని రామోజీరావు.. తన పత్రికలో సుదీర్ఘ వ్యాసం రాశారు. ఆయన అలాంటి వ్యాసాలు రాయడం చాలా అరుదు. 

రామోజీరావు వ్యాసం తర్వాత అమరావతిపై చర్చ మొదలైంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన అమరావతే అన్ని విధాలుగా ఆంధ్రుల వైభవాన్ని ప్రతిబింబిస్తుందన్న అభిప్రాయం చాలామంది వెలిబుచ్చారు. చివరకు చంద్రబాబు కూడా అమరావతి వైపే మొగ్గుచూపారు. కేబినెట్ మీటింగ్ లో అమరావతి పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో రామోజీ ప్రతిపాదన ఎట్టకేలకు సాకారమైనట్టయ్యింది. అలా రామోజీ చరిత్రలో నిలిచిపోతారనడం లో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: